పుట:Andrulasangikach025988mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నితో రాజ్యము చేసెను. కాని, తురకల భయము పోగానే మరల తెనుగురాజులు పరస్పర కలహములతో వినోదించికొనిరి. వెలమరాజులు రాచకొండ, దేవరకొండ కోటలలో తెలంగాణాను పాలించిరి. రెడ్లు తూర్పుతీరమునను, గుంటూరు, కర్నూలు నెల్లూరు జిల్లాలలోను విశేషముగా రాజ్యముచేసిరి. రెడ్డి, వెలమ, రాచవారు అను మూడు తెగలకును నిరంతర వైర ముండెను. పైగా కర్ణాట రాజ్యమనబరగిన హంపీరాజ్యము రెడ్డిరాజ్యమునకు ప్రక్కబల్లె మయ్యెను. గుల్బర్గాలో బహమనీ సుల్తానుల రాజ్య మేర్పడెను. ఆ సుల్తానులలో ఒకరిద్దరు తప్ప తక్కినవా రందరు హిందూద్వేషులై అతి క్రూరముగా వర్తించిరి. ఉత్తరాన ఓడ్రరాజులు సదా దేశద్రోహము చేయుచు ఆంధ్రరాజ్యమును ఆక్రమించి పరిపాలింప జూచుచుండిరి.

ఇట్లు నల్దిక్కుల అలముకొనిన దట్టపు చిక్కులలో రెడ్డిరాజ్యము చిక్కి యుండెను. అట్టిచో నూరేండ్లవర కయినను మొక్కవోక దినదినాభివృద్ధిగా చతుర్దిశల నొత్తుచుండిన శత్రువులను, తురకలను ఓడించుచు రెడ్లు రాజ్యము చేసిరన్న వారిని కీర్తింపవలసినదే. వారు ఒడ్డెల, వెలమల, కన్నడుల, రాచల, తురకల నెదిరించి యుద్ధాలు చేసినదేకాక, అటు బెంగాలువరకును, ఇటు మధ్య పరగణాలలోని బస్తరు వరకును తమ విజయధాటిని సాగించిరి. వారి మంత్రి లింగన గెలిచిన గెలుపు లెట్టి వనగా:-

       "ఝాడేశ వన సప్తమాడె బారహదొంతి
        జంత్రనాడు క్షితీశ్వరుల గెలిచి
        యొడ్డాది మత్స్యవంశోదయార్జునుచేత
        పల్లవాధిపుచేత పలచ మంది
        దండకారణ్యమధ్య పులిందరాజ రం
        భాహివంశజులకు నభయమొసగి
        భానుమత్కుల వీరభద్రాన్ని దేవేంద్ర
        గర్వసంరంభంబు గట్టిపెట్టి
        యవన కర్ణాట కటక భూధవులతో
        చెలిమివాటించి యేలించె తెలుగుభూమి
        తన నిజస్వామి నల్లాడ ధరణినాథు
        భళిరె: అరియేటి లింగన ప్రభువరుండు."

(భీమఖండము, అ 1)