పుట:Andrulasangikach025988mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనులలో వ్యాపింపజేసిరి. తురకలు మహాబలాడ్యులు. ఎదిరింప శక్యము కానివారు అని యనిపించుకొనిరి. ఈ భీతి ఇంగ్లీషువారు భారతీయ రంగముపై కెక్కువరకు ప్రజలలో కానవచ్చెను. ఎందుకన క్రీ.శ. 1650-1700 ప్రాంతమువాడగు వేంకటాధ్వరి తన విశ్వగుణాదర్శములో ఈ విషయాలను స్పష్టముగా వర్ణించినాడు.

రెడ్డి రాజ్య కాలమందలి ముసల్మానుల బీభత్సమును అప్పటి రాజులే శాసనములందుకూడ వ్రాయించినారు. ముసల్మానులు 1324 నుండి 1330 వరకు ఆరేడేండ్లపాటు క్రూరకార్యములు తెనుగువారిపై సాధించిరి. అంతలో ప్రోలయ నాయకుడు, కాపయనాయకుడు వారిని తెనుగు దేశమునుండి పూర్తిగా తరిమివేసిరి. ప్రోలయనాయకుని విలసతామ్ర శాసనమందు అప్పటి పరిస్థితుల నిట్లు పేర్కొనిరి.

"పాపులైన యవనులు బలాత్కారముగా వ్యవసాయము చేసినందువలన పంట పర్యాయములు లాగుకొనుటచేత దరిద్రులు, ధనికులు అను భేదము లేక రైతుల కుటుంబములెల్ల నాశనములై పోయినవి. ఆ మహా విపత్కాలమున ధనము భార్య మొదలగు దేనియందును ప్రజలకు స్వాయత్తతాభావము పోయినది. కల్లు త్రాగవలెను. స్వచ్ఛంద విహారము చేయవలెను. బ్రాహ్మణులను చంపవలెను. ఇది యవనాధముల వృత్తి. ఇక భూమిమీద ప్రాణిలోకము బ్రదుకుటెట్లు. ఈ విధముగా రాక్షసులవంటి తురుష్కులవలన పీడింపబడిన త్రైలింగదేశము రక్షించు వారెవరును మనస్సునకు గూడ తట్టక కార్చిచ్చు చుట్టుకొన్న అడవివలె సంతపించి పోయినది."

(రెడ్డి సంచిక, పుట. 11)

"మహమ్మదీయులు వచ్చినారను వార్త వినగానే దుర్గాధిపతులు అశ్వ భటాకులమైన దుర్గములు వదలి భయాకులులై అడవుల పాలగుచుండిరి" అనియు ఆకాలపు శాసనములందు వ్రాసిరి.

(రెడ్డి సంచిక, పుట 13).

అట్టి కల్లోలములో వారికి ప్రోలయ నాయకుడు అను రెడ్డివీరుడు నాయకుడుగా లేచివచ్చెను. అతడు చెదరిన సైన్యాలను కూర్చుకొని సామంతరాజుల తోడుచేసుకొని, తురకలసైన్యాలనోడించి వారిని తరిమివేసి మరల ఓరుగంటిలో తన కుమారుడును, ఆంధ్రసురత్రాణ బిరుదాంకితుడును నగు కాపయనాయకు