పుట:Andrulasangikach025988mbp.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(18) 'హుసివోవగా' అంటే అసత్యముకాగా-వ్యర్థముకాగా-అని యర్థము. కన్నడంలో ఇదే అర్థం 'పుసి^' అని ప్రాచీనరూపం తెలుగులో 'ముసి' అని మారింది. శ-ర-చూడుడు. 'అధికముకాగా' అనే అర్థము స్వంతమగును. పుట. 277.

(19) 'త్రొక్కుడు బొమ్మ' ఏదో నాకూ తెలియదు. కాని చరణాభ=కాళ్ళ కాంతి, దానిమీద, బచ్చెన=వన్నె-ఘటింప వడికిరని అర్థము సరసంగా లభిస్తుంది. చరణాభ బచ్చెన-రాట్నపు సామానులు కావు. పుట 282.

(20) 'పొప్పళి' అన్న పదము మా ప్రక్క 'చౌకపు ఇండ్లు' అనే అర్థంలో వాడుదురు. పొప్పళి చీరలు నేటికిని ఈ దేశం కోమటి స్త్రీలకు చాలా ప్రియం. పొప్పాయికాయతో దీనికి సంబంధం మృగ్యం. ఈ పదం కన్నడంలోను కలదు. కదరీపతి కన్నడదేశానికి సమీపంలోనివాడు. పుట. 328.

(21) 'జక్కణి' సరియైన రూపమే దక్షిణ నాట్యపద్ధతులలో నొకడు గాబోలు. పుట. 310.

(22) వేణుగోపాల శతకం పదాల సారంగపాణీ వ్రాసినదని విన్నాను. అతడు తిరుపతికి దగ్గరివాడు. పుట 345.

తమ గ్రంథం నిజంగా నా కెన్నో నూతన విషయాలను తెలిపినది. మరల ఎన్నోమారులు పఠింపవలసి యున్నాను. ఆ గౌరవమే పై భిన్నాభిప్రాయములను మీ పునర్విమర్శకొఱకు నన్ను ఇట్లు వ్రాయ బ్రేరించినది. మీ రన్యధా భావింపరని నే నెఱుగుదును.

మీ గ్రంథం చేతికందిననాడే మా అన్నగారు గోపాల కృష్ణమాచార్యులు ఇక్కడనుండి కొంత పఠించి నావలెనే చాలా సంతోషించిరి. అ నాడే వారు వెళ్ళవలసియుండి పూర్తిగా చూడలేరైరి. ఇంతలోనే వారు హైద్రాబాదుకు వత్తురు. తమ దర్శనము చేయదలచినారు. జ్యౌతిషమందు వారెక్కువ పరిశ్రమించినవారని తాము వినియుందురని నమ్మెదను. మరియు విజయనగర చరిత్ర వారి కభిమానపాత్రము. సాహిత్యమందు చక్కని పాండిత్యము.

చిత్తగింపుడు, మీవాడు

రా. అనంత కృష్ణశర్మ