పుట:Andrulasangikach025988mbp.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంజావళి, జయరంజి, మంచు పుంజము, మణికట్టు, భూతిలకము, శ్రీవన్నిమ, చీని, మహాచీని, పట్టు పొంబట్టు, నెరపట్టు, వెలిపట్టు, పచ్చని పట్టు, నేత్రంపుపట్టు, సంకుపట్టు, భావజతిలకము, రాయశేఖరం రాయవల్లభం, వాయుమేఘం, గంజవాళం, గండవరం, వీణావళి - ఇట్టి వన్నీ ఒకనాడు మన తెలుగునాట వేయబడిన వస్త్రవిశేషాలు.

ఒకనాడు మన తెనుగుసీమలో ప్రతి బ్రాహ్మణ గృహంలో ఒక గ్రంథాలయం వుండేది. ధనికులు తివాసీలపై కూర్చునేవారు. "బురునీసు దుప్పటులు కప్పుకొనేవారు. అప్పులవారిని "పొంగడ దండల"తో శిక్షించేవారు. దొంగలనుపట్టి "బొండకొయ్యలో" వుంచేవారు; రెండవ భార్యను చేసుకొంటే, ఆమెకు "సవతి కడెము" తొడిగేవారు: యుద్ధంలో ఓడినవారు "ధర్మాచార" పట్టేవారు; తాంబూలం వేసుకోడానికి "పాన్ దానులు ఉపయోగించేవారు; రైతులు ఏరువాకను, "వింతటి పండుగను" చేసుకొనేవారు; కరణాలు "వహి" అనేపుస్తకాలలో లెక్కలను వ్రాస్తూండేవారు; పీనుగులను కాల్చిన బూడిద మచ్చుమందుగా పనిచేస్తుందని దొంగలు నమ్ముతుండేవారు-ఈ రీతిగా శ్రీ ప్రతాప రెడ్డిగారు వ్రాసిన "సాంఘిక చరిత్ర" మన పూర్వీకుల జీవిత విధానాన్ని గురించి చెప్పే విశేషాలకు అంతేలేదు.

ఈ చరిత్ర దాదాపు ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తాఫలం, సాంఘిక చరిత్రకు పనికివచ్చే గ్రంథాల సంఖ్య పరిమితమైనా, ఇందుకు శాసనాల ఉపయోగం నామమాత్రమైనా, ఆచార వ్యవహారాలకు, క్రీడా వినోదాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ పదాల విషయంలోను, పారిభాషిక పదాల విషయంలోను నిఘంటుకారులు "ఒక భక్ష్యవిశేషం" "ఒక క్రీడావిశేషం" అని అర్థం చెప్పి, నిరర్థకులవలె వ్యవహరించినా, ఇట్టి ప్రతిబంధకా లన్నింటిని అధిగమించి, ఆంధ్రజాతి చరిత్రను ప్రతిభా పూర్వకంగా చిత్రించిన శ్రీ రెడ్డిగారు. సంస్తవనీయులు.

ఆంధ్రజాతి గత చరిత్రను తెలుసుకొనడానికి ఉపకరించడమే కాక, ఏయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరేవేవి దాని పతనానికి దోహదమిచ్చినవో సందర్బానుసారంగా వివరిస్తున్న ఈ మహాద్గ్రంథం ఆంధ్రులకు భావికర్తవ్య పథాన్ని నిర్దేశిస్తున్నది కూడా.

"నాకే యీ గ్రంథము తృప్తి నొసగలేదు" అనే విచారం శ్రీ రెడ్డిగారికి కూడదు. సకలాంధ్రావనికి వారి రచన అపారతృప్తి నివ్వగలదు.

_________