పుట:Andrulasangikach025988mbp.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము 2

1135, కృష్ణమూర్తిపురం

మైసూరు 30-10-49

మహారాజశ్రీ మాన్యులు సురవరం ప్రతాపరెడ్డిగారి సన్నిధికి, మిత్రుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ చేయు మనవి:-

తాము దయతో పంపిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' కృతజ్ఞతతో అందుకొన్నాను. విడిచే బుద్ధి పుట్టక పూర్తిగా చదివితిని. ఇట్లు ఏకదారగా నన్ను చదివించిన గ్రంథము ఈ మధ్యలో ఇదొక్కటే.

చాలా గొప్పపని చేసితిరి. ఇందు సేకరించి మీరు జతపఱచిన విషయాలు చాలా అమూల్యములు. ఎన్నోవత్సరాలుగా ఏకాగ్రతతో చదివి సంగ్రహింపనిది ఈ పని నిర్వహింపగల్గుట కాదు. స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఆంధ్రసాహిత్యంలో వెలువడిన అనర్ఘగ్రంథాలు కొన్నింటిలో ఈ గ్రంథము అగ్రగణ్యమని నమ్ముతాను.

చదివినప్పుడు నాకు స్పురించిన కొన్ని భావాలను తమ పునారాలోచన కోసము ఇందు సంగ్రహముగా మనవి చేయుదును. ఇది సూచన మాత్రమే; విమర్శ కాదని గ్రహింప వేడితిని.

(1) 'పులి జూదములు, దొమ్మరి ఆటలు తెలుగు వారివే (పీఠిక 7) కాని, కన్నడ దేశమందును ఇవి అంతే వ్యాప్తి గల్గియున్నవి. మొదటిది 'హులికల్లు' అను పేరుతో నున్నది. మరి 'దొమ్మరి' వారిని, డొంబ, దొంబ - అని కన్నడు లంటారు. 'రి' అనునది. ద్రావిడ బహువచన ప్రత్యయము. తెనుగు ప్రకృతికి చేరిన దేమో అమర వ్యాఖ్యాత క్షీరస్వామి (11వ శతకం) న్వపచ జాతులలో 'దోంబ' జాతిని చేర్చినాడు. డోంబర్ అనేదే దొంబర - దొమ్మర - దొమ్మరి - అయి యుండును.