పుట:Andrulasangikach025988mbp.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని అవి ఇంగ్లీషు వారి కోర్టులకంటే అక్షరాలా వేయింతలు మేలైనవి. దక్షిణములో తమిళ రాజ్యములోను ఏటేట పంచాయతీ పెద్దల యెన్నికలు జరిగెను. ఆ పెద్దలు సివిల్ క్రిమినల్ (ధనోద్భవ, హింసోద్బవ) అభియోగాలను విచారించిరి, పన్నుల వసూలు, గ్రామపారిశుద్ద్యము, విద్య, ఆరోగ్యము, దేవతా నిలయములను స తాలను సాగించుట మున్నగునవన్నియు వారి అధీనమే. ఇంగ్లీషువారు మనదేశమును గెలిచి మనము అనాగరికులమని మనకు సభ్యతయే లేదని, మన మతము అటవిక మతమనీ, మన విద్యలు చెత్తలనీ భావించిరి. పైగా తమ ఆచారాలు, తమ విధానాలు, తమ విద్యలు, తమ అధిక్యత మనపై మోపుటకు నిశ్చయించిరి. అందుచేత మన పంచాయతీలను తొలగించి తమ అదాలతులను, సదరదాలతులను, దీవానీలను, తర్వాత కోర్టులను స్థాపించిరి. స్టాంపు, ఫీసు, ముడుపులు, సాక్షులభత్యాలు, కోర్టులకు ప్రయాణాలు, అప్రమాణాలు, వకీళ్ళ తర్కాలు, కుతర్కాలు, వితండవాదాలు, ఖానూనుల పేచీలు బారీకులు, అన్నియు ప్రబలెను. పంచాయతీలతోనే మన పూర్వధర్మాలుకూడా మాయమయ్యెను. పూర్వము హింసలు అపరాదములు చేసిన గ్రామమందే విచారణ జరిగెను. కాన అబద్దాలకు కూటసాక్ష్యాలకు వీలు తక్కువగా నుండెను. అప్రమాణము చేయుట వంశనాశన హేతువని జనులు భయపడెడివారు. పంచాయతీ పెద్దలును ధర్మాసనమందు కూర్చుని ధర్మముగా తీర్పులు చెప్పిరి. అవన్నియు కోర్టులద్వారా ధ్వంసమయ్యెను. ఇప్పుడు మరల పంచాయితీలను అడ్డాదిడ్డిగా ఉద్దరింప జూస్తున్నారు. కాని జాతిలోనే సంపూర్ణమగు మార్పు వచ్చినందున వాటికి జయము కలుగునన్న ఆశ తక్కువే.

అదే విధముగా జమీందారీ విధానమువల్ల, రైతువారీ విదానము వల్ల గ్రామసాముదాయిక వ్యవసాయ సంఘాలు (Village communities) నాశన మయ్యెను. ఈ వివరములను మెయిన్ అను ఇంగ్లీషు గ్రంథకర్త (Village Communities in Ancient Inadia) అను గ్రంథమందు చాలా విరివిగా వ్రాసెను.

తెలంగాణములోను మరాట్వాడాలోను ప్రభుత్వము గ్రామాలను పట్టీలుగా కూర్చి వాటి భూమి పన్నును గుత్తేదారులకు వేలం వేసిరి. అట్టి గుత్తాలలోనే వనపర్తివంటి సంస్థానా లేర్పడెను. తర్వాత సర్ సాలార్జంగు కాలములో (ఇంచుమించు 1840 ప్రాంతములో) జిల్లా బందీ యేర్పడెను.