పుట:Andrulasangikach025988mbp.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కాలములో ఆంధ్ర చిత్రకళ తన ప్రత్యేకతను గోల్పోయెను. మనకు ప్రాచీనుల చిత్రాలు లభించలేదు. లేపాక్షిలోని కుడ్యచిత్రాలు కొన్ని మాత్రము శిథిలావస్థలో ఇటీవల బయలుపడినవి. అవి చాలా సుందరమైనవి. వాటిలో విశిష్టతయు ప్రత్యేకతయు కలదు. విజయనగర కాకతీయ చిత్రాలు ముసల్మానుల విధ్వంసన క్రియవల్ల మనకు లభ్యము కాకపోయెను. వేమన కాలములో చిత్రకారులు "ఇంగిలీక మహిమ హేమింపనేరక" ఇంగిలికాన్ని రంగులకు వాడిరి. ప్రాచీన చిత్రకారుల పేర్లు కాని శిల్పాచార్యుల పేర్లుకాని మనకు తెలియవు. చిత్రకారుల వంశములు క్షీణిస్తూ ఈ సమీక్షాకాలములో మిగిలిన జమీందారుల నాశ్రయించెను. మొగల్ చిత్రకళా విధానమే భారతదేశ మంతటను వ్యాపించెను. తెనుగు చిత్రకారులును దానినే అనుసరించిరి. రెండవ నిజాం దర్బారును బంగారు నీరుతో నానావర్ణములతో అతిసుందరముగా "వేంకటయ్య" అను చిత్రకారు డీ కాలమందే చిత్రించెను. దాని మూలప్రతి నవాబ్ సాలార్జంగు బహద్దరుగారివద్ద కలదు. దానినే పిక్టోరియల్ హైదరాబాదు అను దానిలో ముద్రించిరి. ఆ పటము మీద వెంకటప్పయ్య రచన అని మాత్రమున్నది. పేరునుబట్టి అతడు స్పష్టముగా ఆంధ్రుడే. ఇదే సమీక్షాల మందు కర్నూలు నవాబుల నాశ్రయించిన కొందరాంధ్ర చిత్రకారుల వంశాలుండెను. వారి చిత్రాలను జూచి ఆ కళకు కర్నూలు కళ (Kurnool School of Painting) అని కొంద రాధునిక నిపుణులు పేరుపెట్టిరి. కర్నూలు నవాబుల పతనం 1835 తో పూర్తి అయ్యెను. దానితో ఆ చిత్రకారుల పతనమున్నూ జరిగెను. గద్వాలలో సోమనాద్రి అను మహావీరుడు 1760 ప్రాంతములో నుండెను. అతని చిత్తరువులు అతని తర్వాతివారి చిత్రములు 50 ఏండ్ల క్రిందటి వరకు గద్వాలలోని చిత్రకారుల వంశమువారు రచించిరి. వారు గద్దయీకల మూలములలో ఉడుతతోక వెంట్రుకలను కుచ్చుగా కట్టి, సన్నని చిత్రరేఖలను వాటితో తీర్చెడివారు. 200 ఏండ్ల క్రిందట గద్వాలలో కట్టిన కేశవాలయములోని ఒక గోడపై గచ్చుచేసి దానిపై పురాణ చిత్రములను వ్రాసినారు. కాని ఎర్రమన్ను సున్నమే తమ ముఖ్య వర్ణములుగాగల తర్వాతి దేవాలయాధికారులు వాటిలో కొంత భాగాన్ని సున్నముపూసి చెరచినారు. చాలా ప్రాంతాలలో పూర్వపు చిత్తరువులపై శిల్పములపై గచ్చుమెత్తి ఎర్రమన్ను సున్నము పట్టెలు పెట్టుట కానవస్తున్నది. గద్వాల సంస్థానము వారు 250 ఏండ్ల క్రిందట సంస్కృతలిపిలో భారతోద్యోగ పర్వాన్ని వ్రాయించి, ఆగ్రంథము నిండుగా చిత్తరువులు వ్రాయించినారు.