పుట:Andrulasangikach025988mbp.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టివి చాలా వ్రాసినాడు. అదంతయు ఉదాహరించుటకు వీలులేదు అభిలాషులు ఈ సీసమాలికలు పూర్తిగా చదువుకొనగలరు.

చాలామంది యిండ్లముంగిటి భాగాలలో పులి జూదపు ఆటగీతలను పలకరాళ్ళపై మలిపించి యుంచుచుండిరి.

           "ముంగిట పులిజూదములు గీచియుండిన
            రచ్చబండలు గొప్ప ప్రహరిగోడ" (4-123)

నేటికిని తెలుగుదేశమం దంతటను పల్లెలలో ఈ ఆచారము మిగిలి యున్నది.

కోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా ప్రాచీనమగు వినోదము. మన సారస్వతములో కేతనకవి కాలము నుండియు నారాయణకవి కాలము వరకు పలువురు కవులు ఈ పందెములను వర్ణించినారు. కోడి పందెపు శాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు వర్ణించినాడు:

           "కాచిప్రాతలు దారాలు కట్టుముళ్ళు
            ముష్టులును నీళ్ళముంతలు మూలికలును
            కత్తులపొదుళ్ళు మంత్రముల్ కట్టుపసరు
            లెనయవచ్చిరి పందెగాళ్ళేపురేగి
            వేగ నెమిలి పింగళి కోడి డేగ కాకి
            వన్నెలైదింటి కిరులందు వెన్నెలందు
            రాజ్యభోజనగమన నిద్రామరణ
            ములను విచారించి యుపజాతులను వచించి"

ఈ పందెమును గూర్చి ఇంకా నాలుగు పద్యాలిచ్చటనే కవి విపులముగా వ్రాసెను. (3-213)

శైవభక్తులలో వీరభద్ర పళ్ళెరము లిడుట ఆచారముగా నుండెను. (3-188)

జనులలో తాయెతులపై విశ్వాసము మెండుగా ఉండెను. ఈ తాయతు శబ్దము అప్పకవి నాటికే రూడియై పోయెను. తాయెతు శబ్దవిచార మిదివరకే చేసినాను.