పుట:Andrulasangikach025988mbp.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        గురు యశశ్శాలి యగునట్టి గుంటుపల్లి
        మంత్రి నరసింగరాయ సన్మందిరమున
        ఒక్కనాటి వ్యయంబగు తక్కినట్టి
        దేశ పాండ్యాల యొకయేటి ప్రాశసంబు.

దేశముఖు దేశపాండ్యాల నియామకము మహారాష్ట్ర పద్ధతియే.

పెమ్మయ సింగరాజు అను నతడు ప్రౌడ దేవరాయల నాటివాడని యందురు. ఉండవచ్చును. ఎందుకనగా అతని కాలము నాటికి మన హిందూ స్థానములో మిరపకాయలు నెగడలేదు. వాటిని క్రీ.శ. 1600 ప్రాంతములో అమెరికానుండి తెచ్చి మన ప్రాంతములో నెగిడించిరి.

        పెమ్మయ సింగరాజును గూర్చి ఒక చాటు విట్లున్నది.
       'మిరియములేని కూరయును
        మెచ్చు నెరుంగనివాని యీవి యున్‌'

ఈ విషయమును బట్టి కూడ క్రీ.శ. 1600 తర్వాత మిరపకాయలు మన దేశములో వ్యాపించెనని తెలియగలదు.

తెనుగు దేశములో కొంత భాగము సముద్రతీరమందుండుటచేత ప్రాచీనమునుండియు గొప్ప వ్యాపారము జరుగుచుండెను. కాని మన సమీక్షాకాలములో దేశము అరాచకమైనందున వ్యాపారమునకు రక్షణ లేకుండెను. గోలకొండ రాజ్యము పడిపోయెను. కర్నూలు కడపలలో ఆప్గన్ నవాబులు రాజ్యము చేసిరి. దక్షణమున ఆర్కాటు నవాబు లేర్పడిరి. ఉత్తర సర్కారులలో ఇంగ్లీషు, ఫ్రెంచివారు వ్యాపారముతోపాటు యుద్ధాలు కూడ చేయుచుండిరి. తెల్లవారు వ్యాపారము చేసినచోట మన దేశ వ్యాపారము నాటికిని నేటికిని ముందుపడుట లేదుకదా:

క్రీ.శ. 1611 లో ఇంగ్లీషువారు మచిలీబందరులో ఒక ఫ్యాక్టరీ పెట్టిరి. అప్పుడు మచిలీబందరు బట్టలు చాలా ప్రసిద్ధి కెక్కియుండెను. ఇంగ్లీషులోని మస్లిన్ పదము మచిలీనుండియే వచ్చెను. గోలకొండ రాజ్యమున్నపుడు అక్కన్న మాదన్నల నాశ్రయించి వారికి నజరానా లిచ్చి బహుమానా లిచ్చి ఇంగ్లీషువారు మదరాసులో వ్యాపారము సాగించుచుండిరి. గోలకొండ పడిపోగానే ఔరంగజేబునుండి చెన్నపట్టణములో, మసూలాలో, మోటుపల్లిలో,