పుట:Andrulasangikach025988mbp.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక బట్టపై లావు కాగిదములను రెండు ప్రక్కల అతికింతురు. లేదా లావు అట్టలను తీసుకొందురు. వాటిపై కట్టెబొగ్గును రాయుదురు. దానిపై కుంట గల్జర (భృంగరాజము) ఆకు రసమును పిండి ఆకుతో రాయుదురు. కొందరు ఆ పసరుతో గోందును కలిపి రాయుదురు. కుంటగల్జర లభించని పక్షమున బీర ఆకు రసము, అదియు లభింపని పక్షాన అముడుక అను పొలాలలో సమృద్ధిగా దొరకు అలమును దానిపై రుద్దుదురు. బొగ్గు, బంక, పసరు మూడును అట్టపై కలిసి నల్లని గట్టి పూత (paste)గా ఏర్పడును. అది బాగా ఆరిన తర్వాత దానిపై కోపు బలపము అను మెత్తని తెల్లగా వ్రాయు రాతి బలపముతో వ్రాసికొని తుడుచుచు వ్రాయుచుందురు. ఇప్పుడు నష్టకారులగు రాతిపలకలు, బలపాలు వచ్చినవి. పూర్వము కట్టె పలకపై వ్రాసుకొనుచుండిరి. విద్యార్థులు తమ కట్టెపలకలపైన పై గోందు, బొగ్గు, కుంట గల్జెర పసరును రుద్దుచుండిరి. ఇప్పుడు అట్టతో చేసిన కడితాలుకాని, కట్టె పలకలు కాని మోటై పూర్తిగా మాయమైనవి. పాండురంగ విజయములో కోవ, కడితము, కళితము, కవిలె అను పదాలు కలవు.[1]

అచ్చనగండ్ల యాటలు ఆడువారి యాటగానే యుండెను. నేటికిని అంతే (సాంబో. 2-121). కొన్ని వేశ్యవాటికలలో వందెములతో కూడిన ఆటలు పండుగల వేళ సాగెడివి.

          "కచ్చించి సొగటాలు గణకలతో కుక్కు
               టాండముల్ పణముగా నాడువారు
           ద్రవిణముపై పన్నిదము లొడ్డి మాత్సర్య
               గతి కోడి పందెముల్ కట్టువారు.
           నైచిత్రిగాగోల గాచి పన్నిదమాడి
               చెరుకుమోపులు లీల నరుకువాడు
           గురిచూసి యట కేగ పరతెంచునందాక
               నొసగిన భక్ష్యముల్ మొసగువారు
           ఆడ్యులై గోత్రశాలల నధివసించి వి
               టుల వేశ్యాజనముల చక్కటుల దీర్చు

  1. పాండురంగ మాహాత్మ్యము. 5-74-80, 81, 82.