పుట:Andrulasangikach025988mbp.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బట్టలు జనులకు ప్రియమయ్యెను. ఆరికకూడు, పుచ్చవరుగు, ఆవుల వెన్నతిని మజ్జిగ సద్దులతో రెడ్లు దున్నుటకు బోయిరి. (పంచతంత్రము 1-686 నుండి 688.)

వైదిక బ్రాహ్మణుని లక్షణాలను వేంకటనాథు డిట్లు తెలిపినాడు. నీర్కావి ధోవతి పింజపోసి, ధౌతోత్తరీయము వేసికొని గోపి చందనముతో ఫాలము నలంకరించుకొని బిళ్ళ సిగలో పూలు పెట్టి యుండెను. (పంచ. 5-244.)

గొల్లల జీవనమును వెంకటనాథుడు చాలా విపులముగా వర్ణించెను, 'ఒక గొల్లకు గొర్లమంద, ఆవులు, దుక్కిటెడ్లు, దొడ్డి, గరిసెలు ఉండెను. ఆ గొల్ల పెద్దకు కులబిరుదు 'బోయడు' అని యుండెను. అతడు అట్టలెత్తిన పాతచెప్పులు దొడిగి, అంబటికుండ మోసికొని, గోచిపెట్టి ములుగత్తి నడుమున కట్టి కొడిది పూసల మొలత్రాడు కలిగి, ఒడిసెల, పాలకావడి పట్టి బుజముపై గొంగడి వేసుకొని, పిల్లనగ్రోవి బట్టి యింటికి వెళ్ళెను. (పంచ. 1-598.)

ఆ కాలమందు లెక్కలు వ్రాయుటకు తాటాకులేకాక కాగిదాలమీద 'కోవలువడ' వ్రాసిరి. (కోవలు నిఘంటువులలో పిల్లలగొంతు జబ్బు అని వ్రాసినారు. ఇక్క డది సరిపోదు. కట్టలు కట్టలుగా వ్రాయుట అని యర్థము. పూర్వము కాగిదాలను ఒకదానికొకటి యతికించి వ్రాసి చుట్టగా చుట్టి యుంచెడి వారు. ఆ చుట్ట పదివారల వరకు కూడా పెరిగిపోయెడిది. మరొక విధము 'కడితము'లో వ్రాయుట. కడితము అన మసిపూసి గట్టన చేసిన చదరపు గోనెపట్టతో జేసిన లెక్క పుస్తకము. అని పాండురంగ విజయ టీకాకారులు వ్రాసినారు. గత ప్రకరణములో ఇట్టి విషయము చర్చించి ఇంచుమించు 40 ఏండ్ల క్రిందట పాలమూరు జిల్లాలో వ్యాపారులు కోపు బలపాలతో నల్లని పూతగల అట్టలపై వ్రాసి తుడిచి మరల వ్రాసుకొనుచుండిరని తెలిపినాము. అదే యీ కడితము; లేక కశితము, కడితము జేనెడు పొడవును ఆరే డంగుళముల వెడల్పును కల 5-6 అట్టలు కలిగి అవన్నియు మడుచుకొను నట్లతికించి చేసినట్టి వ్రాతకు సాధన మగునట్టి పలకము. ఇంచుమించు క్రీ.శ. 1920 వరకు ఇవి హైద్రాబాదు రాష్ట్రములో కోమట్లవద్ద వాడుకలో నుండెను. వృద్ధుల వలన నేను విచారించి తెలుసుకొన్నంత వరకు వాటి నీ క్రింది విధముగా సిద్ధము చేయుచుండిరి.