పుట:Andrulasangikach025988mbp.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లుదురు. అట్టిపీటకు ఆనుకొనుటకు కుర్చీవలె వీపుపలక అతికి యుండును. దానిని చేవపీట యందురు. ఒరుగుపీట యనియు నందురు.

వంటకూలియిండ్లను స్త్రీలే, అందును వితంతువులే, వారును బ్రాహ్మణ వితంతువులే, ఎక్కువగా నడిపించెడువారు. అచటికి నానాప్రాంతాల కవి, గాయక, పండితులు, ఉద్యోగులు, పథికులు వెళ్ళి "మినుకులు" ఇచ్చి అన్నము భుజించెడివారు. ఆ పూటకూళ్ళు కాకతీయులకాలము నుండియు బంధకీ జారులకు రాయబారాలు జరిపే స్థానాలు.[1]

కోమట్లు:-

కోమట్లకు 'గౌర' యను పేరుకూడ నుండెనని మూడవప్రకరణములో తెలుపనైనది. శుకసప్తతిలో కొన్ని తావుల నీపదమును ప్రయోగించిరి. 'వసుమంతు డను గౌర చెలుపుమీర,'-'ఆ గౌర మనుచున్న' తన్న గరీరత్నము', 'సరి బేరులైన గౌరలు', 'అని గౌర పలు తెరంగుల' అని మొదటి కథలోనే యిన్ని మారులు వాడినారు. కోమట్లలో గౌరయ్య, గౌరమ్మ అను పేరు లెక్కువ, కోమటి కొమ్మలు మణులకమ్మలు, సూల చేకట్లు (కంకణాలు) "సిరాజిగను పులగళ్ళ చేకటులు, (పర్షియాలోని షిరాజ్ పట్టణము నుండి వచ్చిన కంకణములు) పొప్పళికుచ్చెలచీర ధరించెడివారు. కోమట్లకు వ్యాపారము ప్రధానవృత్తిగా నుండెను. వారు సాధారణముగా ధనికులు, అయితే వారు బహుళముగా లోభులై యుండిరని కవులు వర్ణించిరి. వేములవాడ భీమకవి యిట్లు కోమట్ల తిట్టెను.

         "గొనకొని మర్త్యలోకమున కోమటి పుట్టగ పుట్టె దోస, బొం
          కును కపటంబు, లాలనయు, కుత్సితబుద్ధియు, రిత్తభక్తియున్,
          ననువరిమాటలున్, బరధనంబును గ్రక్కున మెక్కజూచుటల్,
          కొనుటలు నమ్ముటల్ మిగులగొంటుదనంబును మూర్ఖవాదమున్."

         "కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేదు; యింటికిన్
          సేమ మెరింగి చిచ్చిడిన పాపము లేదు........"

అన్న భీమకవియే యీ విషయములో ఉదారుడట. ఇంకొకకవి భీమ కవిపై యౌదార్యమును చాలా యాక్షేపించెను.

  1. శుకసప్తతి. 1-116;49 మరియు "క్రీడాభి".