పుట:Andrulasangikach025988mbp.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గులు సింహళమునుండి, ముఖ్మల్ మక్కానుండి దిగుమతి యయ్యెను."[1] (మక్కా నుండి వచ్చిన మల్లు అగుటచే కాబోలు మఖమల్లు అని పేరు వచ్చెనో యేమో?), మన వాఙ్మయములో పల్నాటి వీర చరిత్రలోను, ఇతర పద్యకావ్యాలలోను మఖమల్ ముచ్చట కలదు.

ముస్లిముల తర్వాత వ్యాపారము విరివిగా చేసినవారు కోమటి సెట్లు, మలబారీలు. అయితే వీరు విదేశాలతో వ్యాపారము చేసినది తక్కువే. సామ్రాజ్యమం దొక ప్రాంతమునుండి మరొక ప్రాంతానికి సరుకులు మార్చినవారే. కోమటిసెట్లలో అరవ నాటుకోటచెట్లే యెక్కువ వ్యాపారము చేసినారు.

దేశమందు బాటల నిర్మాణము చాలా తక్కువ. అందుచేత బండ్లపై వ్యాపారము చేయుట కనుకూలముగా లేకుండెను. వ్యాపారస్థులు ఎద్దులపై కూలీల కావళ్ళపై, గుర్రపు తట్టువులపై, గాడిదలపై కంచర గాడిదలపై సరుకులను తీసికొనిపోతుండిరి. ఈవిషయమును మన సారస్వతమందు పలుతావులలో తెలిపినదేకాక ఆగంతుక వైదేశికులగు పీస్, బార్బోసా పభృతులు తాము చూచినట్లు తెలిపినారు. బాటలు లేక అడవులెక్కువగా నుండినప్పుడు దొంగలు కూడా ఎక్కువగానే యుండిరి. పరకాలుడను వైష్ణవభక్తుడు వైష్ణవకైంకర్యమునకై బాటలు కాచి, వ్యాపారులదోచి, రేవులను కొల్లగొట్టి ధనములాగుటను ద్విపద పరమ యోగివిలాసమం దతివిపులముగా వర్ణించినారు. (చూడుడు. 6వ, 7వ ఆశ్వాసాలు) దొంగలభయానికి వ్యాపారులు గుంపులుగాపోయిరి. "విజయ నగరము నుండి భట్కల్‌కు అయిదారువేల యెద్దుల మోతల సరుకులు తీసికొని పోవుచుండిరి 20 లేక 30 పశువుల కొకమనిషి వంతున నుండెను" అని పీస్ వ్రాసెను.[2]

ఆ కాలపుదరల సమకాలికులు కొందరు వ్రాసియుంచినారు దానిని చూచిన ఆనాడన్నియు చాలా చౌకగా లభించెడివని తెలియరాగలదు. పీస్ ఇట్లు వ్రాసియుంచెను.

"విజయనగరమందు సకలవస్తువులు లభించినట్లు ప్రపంచములో మరెందును లభించవు. బియ్యము, గోధుమలు, పప్పుధాన్యాలు, జొన్నలు, చిక్కుళ్ళు,

  1. V. S. C. P. 221-2.
  2. V. S. C. P. 224.