పుట:Andrulasangikach025988mbp.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పరిస్థితి నంతయు ఒకే వాక్యములో చెప్పవలెనంటే:- వేదాలకు అస్తమయం, నీతికి ప్రలీనం, ధర్మానికి స్వస్తి, చరిత్రకు చ్యుతి సత్కార్యాలకు విరతి, కులీనతకు నాశనం, కలిగి కలియొక్కటే దన్యత నొందినది.[1]

గంగాదేవి వ్రాసిన పై విషయాలలో టెంకాయ చెట్లను మధురా సుల్తానులు కొట్టించి వాటి స్థానములో శూలాలు పాతించి, వాటిపై హిందువుల తలలు గట్టించిరన్న విషయమునకు అ కాలమందలి ఇబన్ బతూతా అను అరబ్బు యాత్రికుడు స్వయముగా చూచి ఇట్లు వ్రాసినదే తార్కాణము.

"గయాజుద్దీన్ మధురను రాజ్యము చేస్తుండగా హిందువులను చాలా బాధపెట్టెను. గయాజుద్దీన్ అడవినుండి మధురకు వెళ్ళుచుండగా నేను (ఇబన్ బతూతా) వెంట నుంటిని. అప్పు డాతనికి విగ్రహారాధకులు (హిందువులు) పలువురు తమ స్త్రీలతో, పిల్లలతో వెళ్ళుచు ఎదురుపడిరి.. వారు అడవిలోని చెట్లు కొట్టి బాటచేయుటకై నియుక్తులై యుండిరి. సుల్తాను వారిచే రెండు కొనలందు వాడి మొనలుగల శూలములను మోయించెను. తెల్లవారగానే వారిని నాలుగు గుంపులనుగా విభజించి నగరముయొక్క నాలుగుద్వారాలవద్ద కంపెను. శూలాలను భూమిలో పాతించి యా శనిమాలిన దరిద్రుల వాటిపై గ్రుచ్చి చంపించెను.

ముసల్మానుల విజృంభణమున కనేక కారణములు కలవు. అందొకటి హిందువులలో మతభేదము లేర్పడి పరస్పర వైషమ్యములు ముదిరిపోవుట. కాకతీయుల కాలములో శైవమత విజృంభణమును గమనించినాము. విజయనగరారంభ దశలో వైష్ణవ మతవ్యాప్తి కానవచ్చెను. ఈ కాలమువరకు ఆచార్య త్రయమువారి అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతములు వ్యాప్తిలోనికి వచ్చెను. జైన బౌద్ధుల సమ్ఖ్య లెక్కలేనిదయ్యెను. ఇక మిగిలినవి శైవ వైష్ణవములు. శైవులు మొదట పరసాంప్రదాయములను నోటికి వచ్చినట్లు తిట్టుటకు మొదలుపెట్టిరి. శివుని దప్ప అన్య దైవతమును మెచ్చినవారి నెత్తిన కాలు పెట్టుదుమనిరి. శివుని వలననే విష్ణ్వాదులు వరములంది మాన్యాలుపొంది సామంత స్థితిలో నుండినట్లు కథలు కల్లలుగా వ్రాసుకొనిరి.

  1. మధురా విజయము, అష్టమ స్సర్గము, ఆదిభాగశ్లోకాలు.