పుట:Andrulasangikach025988mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని కోరెను. ఈపద్యము శ్రీనాథునిదే! సందేహములేదు.

         దాక్షారామవధూటీ
         వక్షోరుహ మృగమదాది వాంఛిత విలస
         దక్ష: కవాట బాంధవ
         రక్షావిధి వజ్రపంజర కృపాజలధీ ![1]

        "దక్షావాటీ .......గంధర్వపురోభామినీ"[2]

        "దాక్షారామ చళుక్యబీమ వరగంధ
         ర్వాప్సరో భామినీ, వక్షోజద్వయ గంధసార"[3]

అనుభాగాలను వ్రాసిన శ్రీనాథుడు పై చాటువున చెప్పలే దనగలమా ? ఆకాలములో పండితులు చదువుకొనిన విద్యలు పెక్కులుండెను. భారత రామాయణములు చదువని పండితులు లేకుండిరి. శ్రీనాథుని కభిమానులగు గీర్వాణవాణికవులలో కాళిదాసు, భట్టభాణుడు, ప్రవరసేనుడు, హర్షుడు, భాసశివభద్ర సౌమిల్ల భల్లులు, మాఘ భారవి బిల్హణులు, భట్టి చిత్తన కవిదండి పండితులును ముఖ్యులు[4] మురారిని పేర్కొనలేదు కాని అతని సమాసాలు చాలా వాడెను. తెనుగులో నన్నయ తిక్కన కవులును, వేములవాడ భీమకవి, ఎర్రాప్రెగడ అతనికి ముఖ్యులు. అతడు, "వినిపించినాడవు వేమభూపాలున కఖిలపురాణ విద్యాగమములు"[5] అని కీర్తనీయుడయ్యెను.

మరియు "అభ్యర్హిత బ్రహ్మండాది మహాపురాణ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిదానము"[6] అనియు పేరొందెను. డిండిమ కవిసార్వభౌము నోడించిన వాడెన్ని శాస్త్రాలు చదివి యుండవలెనో యూహించుడు. ఇతర పండితులును ఇన్ని శాస్త్రాలు చదివినవారై యుందురు. ఆకాలములోని కొన్ని శాస్త్రాల ముచ్చట యిట్లుండెను.

  1. భీమేశ్వర పురాణము. అ 3. ప 221.
  2. భీమేశ్వర పురాణము. అ 1. ప 91.
  3. కాశీఖండము. అ 1.
  4. భీమేశ్వర పురాణము. అ-ప. 3.
  5. భీమేశ్వర పురాణము. ప 23.
  6. శృంగార నైషధము. కృత్యాది.