పుట:Andrulasangikach025988mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాభివృద్ధి మున్నగు నుత్తమగుణము లన్నియు కలసిన విశిష్టగుణము...ఆంధ్రులకు ప్రత్యేక సంస్కృతి కలదు. ఆంధ్రుని, అరవను, బంగాళీని, పఠానును చూచిన వెంటనే వీరు వీరని వేరుపరుపవచ్చును. ఎందుకు? అది వారి వేష భాషలను బట్టియే! అందుచేత ఆ సకల భాషావాగనుశాసనులు, స్వస్థాన వేషభాషాభిమతాః స్సంతో రసప్రలుబ్ద ధియః అని సెలవిచ్చిరి. ఆంధ్రుల నుండి వారి భాష, భాషలోని నుడికారము, వారి భావములు, వారి శిల్పకళ, వారి పల్లె పాటలు (Folk Songs)s, కథలు (Folk Tales), విశ్వాసములు, వారి చరిత్ర, వారి సాంఘీకాచారములు, తీసివేసిన, రేపే వారు అడవిజాతులలో కలిసిపోగలరు. ఇతరులలోని ఉత్తమ కళలను స్వీకరించి తమవాటితో మేళవించి తమవిగా చేసుకొనుట నాగరిక లక్షణము. విజయనగర సామ్రాట్టులు, మధురా, తంజాపురీ నాయక రాజులును, హిందూ ముస్లిం శిల్పసమ్మేళనము గావించి ప్రత్యేకాంధ్ర శిల్పమును స్థాపించిరి. ఆంధ్రులు తమ భాషకు శ్రావ్యతను సమకూర్చి కర్ణాటక సంగీతమను పేరుతో ఖ్యాతిగాంచిన కళను దక్షిణాపథమున కంతటికిని ప్రసాదించిరి. మళయాళములో కథాకళి, గుజరాతులో గర్కనృత్యము, ఉత్తర హిందూస్థానములో రామలీల, కథక్ నృత్యము, అసాములో మణిపురీ నృత్యము మున్నగు విశిష్టవైవిధ్య నృత్యాలు భారతదేశ మందలి నానాప్రాంతలలో నే విధముగా వెలసెనో! ఆంధ్రు లందున కూచిపూడి భాగవతులచే పరరక్షితమైన నృత్యమునకు ప్రత్యేకత కలదు. రామప్ప గుడిలోని నృత్యశిల్పములు జాయసేనాని నృత్య రత్నాకరానికి ఉదాహరణములు.

హిందువు లందరికిని పండుగలు పబ్బములు ఒకటే యన వీలులేదు. ఔత్తరాహులకు హోలి, వసంత పంచమీలు ప్రత్యేకాభిమతములు. తమిళులకు పొంగల్ పండుగ ముఖ్యము. అటులే ఆంధ్రులకు ఉగాది, ఏరువాక పున్నమి ముఖ్యమైనవి.

భారతదేశమం దొక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధమగు ఆటలు కలవు. తెనుగువారికి ఉప్పన బట్టెలాట, చిల్ల గొడె (బిల్లగోడు) ఆటలు ముఖ్యమైనవి. "ఉప్పనబట్టె లాడునెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్" అని నాచనసోముడు వ్రాసెను. పులిజూదములు, దొమ్మరి ఆటలు తెనుగువారివే. ఇవి ఆ నాడు తెలిపిన విషయాలలో కొన్ని. ఆనాటి భావములలో ఈ నా డేమియు మార్పు కలుగలేదు. పైగా ఆ భావాలు స్థిరపడినవి.