పుట:Andrulasangikach025988mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారు. అదే పద్ధతులపై శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారును తమ రెడ్డి రాజ్య చరిత్ర మందలి సాంఘిక చరిత్ర భాగమును రచించినారు. పెదపాటి ఎర్రనార్యుని మల్హణ చరిత్ర కావ్య పీఠికలో నిట్లు వ్రాసినారు.

"కృష్ణరాయ యుగమునకు పిమ్మట ఆంధ్రుల పరాక్రమ పౌరుషము లెట్లు క్షీణించినవో ఆదరాభిరుచులును అట్లే కుంటువడినవి. అందువలన ఆ యుగమున ప్రభవిల్లిన కావ్యసంతతి అత్యుత్తమమైనది కాకపోయినప్పటికిని ఆ యుగమందలి సాంఘిక జీవనమును, ప్రజాభిరుచిని ప్రతిబింబించునట్టివి. ఈ దృష్టితో మనము చూడగలిగినప్పుడు ఏకవి రచించిన కావ్యమైనను శిధిలము కాకుండ రక్షించుట మన బాధ్యత యని తేటపడును."

పలువురు మన పూర్వుల సాంఘిక జీవనమును గూర్చి ముఖ్యముగా క్రీడాభిరామాధారముపై కొన్ని వ్యాసాలు వ్రాసిరి. కాని సమగ్రమగు ఆంధ్రుల చరిత్ర ఇంతవరకు వెలువడలేదు. నేను మే నెల 1929 లో హైద్రాబాదు నుండి వెలువడుచుండిన "సుజాత" మాస పత్రికలో "తెనాలి రామకృష్ణుని కాలమందలి ఆంధ్రుల సాంఘిక జీవనము" అను వ్యాసమును కేవలము పాండురంగ మహాత్మ్యములోని వర్ణనల సమయ సందర్బములనుబట్టి విషయములను తేల్చి వ్రాసితిని. ఆ పద్ధతి నాకు సరిగా కనబడెను. ఆ జాడను బట్టుకొని అప్పుడప్పుడు కాకతీయుల కాలమందలి సాంఘిక చరిత్ర, కృష్ణరాయల కాలపు సాంఘిక చరిత్ర, కదిరీపతికాలపు సాంఘిక చరిత్ర, రెడ్డియుగపు సాంఘికచరిత్ర, ఆంధ్ర దశకుమార చరిత్రము తెలుపు తెనుగువారి సాంఘిక చరిత్ర మొదలగు వ్యాసాలను వ్రాస్తిని. తత్పర్యవసానమే యీ గ్రంథము.

ఆంధ్రులకు ప్రత్యేక చరిత్ర యేల? వారికి భారతీయ హిందువుల నుండి భిన్నించిన సంస్కృతి (Culture) కూడా కలదా? యని తెలంగాణములో ఆంధ్రసభలో 12 ఏండ్లనా డొకవాదము బయలుదేరెను. అప్పుడు (క్రీ.శ. 1937 ఈశ్వర పుష్యము) ఆంధ్ర సంస్కృతి యను వ్యాసమును ప్రకటించి యుంటిని. అందిట్లు వ్రాసితి.

"ఆంధ్రత్వ మాంధ్రభాషా చ! సాల్పస్య తపనః ఫలం॥"

అని తమిళుడగు అప్పయ్య(ర్) దీక్షితులు వ్రాసిరి. 300 ఏండ్ల క్రిందటనే తమిళ ప్రసిద్ధ పండితునికి ఆంధ్రత్వమందు భిన్నత్వము కానవచ్చెను...... సంస్కృతి యనగా నాగరికత, లలితకళలు, సారస్వతము, సభ్యత, దైనంది