పుట:Andhrulacharitramu-part3.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహమ్మదుషాహవిధించు సంధినిబంధనలకు లోబడవలసివచ్చెను. మహమ్మదుషాహ రెండుసంవత్సరములు తెలుగుదేశములోనుండి యున్నవాడగుటచేత వెంటనే తనసైన్యములతో స్వరాజధానికి మరలిపోవుటకును, బహదూర్ ఖాను కైలాస దుర్గమున విడిసి యుండి యనపోతభూపాలు డర్చించుకానుకలందుకొనుటకు నొప్పుకొనియెను. మహమ్మదుషాహ గోలకొండదుర్గమును అజీమ్‌హుమాయూనుని వశము గావించి కలుబరిగిపట్టణమునకు మరలి పోయెను. మార్గమధ్యమున విదర్భాపురమున (Beder) మూడుమాసములుండి శ్రమ దీర్చుకొనుటకై తనసైన్యాధిపతులను వారిసైనికులతో వారిస్వస్థానములకు బంపించెను. అటుపిమ్మట తెలుగురాయబారి కైలాసదుర్గమున నివసించియున్న బహదూర్ ఖానుకడకు బోయి తమరాజుపక్షమున గానుక లర్పించెను. అతడు వానిని మహమ్మదుషాహకడకు గొనిపోయి యావృత్తాంతమును సుల్తానునకు నివేదించెను. అతండును నాతని సబహుమానముగా సత్కరించి సంతోషపెట్టెను. కొన్నిదినములు గడచిన తరువాత రాయబారి తమకును సుల్తానునకును ఇకముం దెప్పుడు కలతలుజనింపకుండునట్లుగ సరిహద్దులనిర్ణయింప జేసి బహదూర్ ఖానునకుం దగిన నజరానా రాయలపక్షమున నిప్పించెదనని యతనితో జెప్పెను. ఈసమాచారమును బహదూర్