పుట:Andhrulacharitramu-part3.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నియు జెప్పించెనుగాని చక్రవర్తి గృహసంబంధములైన చిక్కులలో దగుల్కొని యుండి వారిపలుకులను పెడచెవిని బెట్టి వినకుండెను. ఈసమాచారమును విని మహమ్మదుషాహ తెలంగానాదేశముపై దండెత్తి వశపఱచుకొనుట యుత్తమ కార్యమని నిశ్చయించుకొనియెను. పిమ్మట మహమ్మదుషాహ యథాప్రకారము రాజ్యభారమును మల్లెకుసయుఫీద్దీను ఘోరీపైన బెట్టి యనేకవాహీనీవ్యూహములతో బయలుదేరి కైలాసదుర్గమునకు వచ్చి తనసైన్యమంతయు రెండుభాగములుగ జేసి విదర్భసైన్యములకు అజీమ్‌హుమాయూనుని నధిపతిగ నియమించి యాతని గోలుకొండదుర్గముపైకిని సఫ్‌దర్‌ఖానుని నోరుగల్లుదుర్గముపైకిని బంపించి తాను సఫ్‌దర్ ఖానుని వెంబడించెను. అనపోతనాయడు తన రాజ్యమునకు బ్రాగ్దిశాభాగమున ధరణికోట సమీపమున గొండవీటిరెడ్లతో బోరాడుచున్నవాడగుటచేత నోరుగల్లుదుర్గమునకు రక్షకుడుగానున్న నాయకు డసహాయుడై యున్నందున దుర్గమును విడిచి యడవులకు బాఱిపోయెను. ఈసమాచారమును విని యనపోత భూపాలుడు రెడ్లతో యుద్ధమును జాలించి నిజరాజధాని కేతెంచియు దురుష్కుల నెదుర్కొనుటకు దగిన సైన్యములను సమకూర్చుకొనుటకు కాలము చాలనందున నిరుత్సాహుడై మహమ్మదుషాహతో సంధిచేసికొన దలంచెను. అందువలన