పుట:Andhrula Charitramu Part 2.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లించిన చోడులను గూర్చి మరియొక తావున దెలిపెదను. ఈ పొత్తపి శబ్దము పెక్కండ్రు చోడరాజులయొక్క బిరుదనామములతో బొందుపరుపబడియున్నది. ఒకానొకప్పుడు ఈ రాజులకు పాకనాటిలోని కందుకూరు రాజధానిగనుండుచువచ్చెనని పెద్ద చెరుకూరు శాసనమువలన దెలియుచున్నది. దీనికిబూర్వము స్కందపురమని పేరుగలదు. ఈ రాజులయొక్క ప్రాచీన చరిత్రము దెలియలేదు. ఈ పొత్తపినాటిని బరిపాలించిన దాసవర్మ సంతతివారు కమ్మనాటిని జయించి కొట్యదొనను రాజధానిగా జేసికొని బరిపాలనము చేసిరి. ఈ కొట్యదొనపట్టణము ఇపుడు గుంటూరు మండలములోని నరసారావుపేటకు సామీప్యమున కొణిదెన యను పేరితో బరగుచున్నది. ఈ చారిత్రము కొణిదెన శాసనములంబట్టి దెలియుచున్నది గాని, పొత్తపినాటిలోని వారు కమ్మనాటిలోనికెట్లు వచ్చిరో స్పష్టముగా దెలిసికొనుటకాధారము లేదు. చాళుక్య చోడ చక్రవర్తి యగు మొదటి కులోత్తుంగుని పాలనావసానకాలమున నిదివరకెన్నడును దెలుపబడని కొంత కల్లోలము వేగిదేశమున సంభవించినట్లుగ గానంబడుచున్నది. కులోత్తుంగుని పరిపాలన కాలమున వేగి దేశమును బాలించెడి రాజప్రతినిధులు వెంటవెంటనే మారుచుండుటయు, కులోత్తుంగుడు వెలనాటి చోడుని దత్తకునిగ స్వీకరించుటయు, మొదలగువానియొక్క పూర్వోత్తర సందర్భములు విస్పష్టములు గాకయున్నవి. ఎనిమిదవ శతాబ్దములో రేనాటిని పాలించిన చోడులు మూడుశతాబ్దములూరును బేరును లేకయుండి, వేగిదేశమున గల్లోలము కలిగినప్పుడు సమయమును గనుపెట్టి కమ్మనాటిలో రాజ్యమును స్థాపించియుండవచ్చును. ఈ తెలుగుచోడుల శాసనములు కమ్మనాటిలో గానవచ్చుచున్నవి.

బల్లయచోడదేవ మహారాజు.

శ్రీమన్మహామండలేశ్వర బల్లయచోడదేవ మహారాజుయొక్క క్రీ.శ.1106_7వ సంవత్సరములోని శాసనము ప్రాచీనమైనదిగ గన్పట్టు