పుట:Andhrula Charitramu Part 2.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నది. ఇతడు కమ్మనాటికి ముఖ్యపట్టణమగు కొట్యదొన అను కొట్టిదొన (కొణిదెన) యందు బల్లీశ్వరాలయమను పేరుతో నొక శివాలయమును గట్టించెను. దాని చిహ్నములిప్పుడు గానరావు. ఒరయూరుపురవరాధీశ్వరులమనియు, టేంకణాదిత్యులమనియు, బిరుదనామములను వహించుట కొణిదెన చోడులకు నాచారమైయుండెను. ఒరయూరు కావేరీతీరముననున్నది. ఇది పూర్వము ప్రాచీన చోళమండలమునకు రాజధానిగనుండెను. ఈ చోడబల్లి కుమారసంభవమను మహాకావ్యమును రచించిన నన్నెచోడుని తండ్రియైనటుల గుమారసంభవములోని ఈ క్రింది పద్యమువలన దేటపడుచున్నది.

"చ. అదినరపాలమౌళిదళితాంఘ్రియుగండయి పాకనాటియం
దిరువది యొక్క వేయిటి కధీశుడు నా జనుచోడబల్లికిం
జిరతర కీర్తికగ్ర మహిషీ తిలకం బన హైహయాన్వయాం
బరశశిరేఖ యైన గుణభాసిని శ్రీసతికిం దనూజుడన్."

ఆ కాలమునందు కమ్మనాడు పాకనాటిలోని యొక భాగముగానుండెను. పాకనాడు జయంకొండ చోళవలనాడులో నంతర్భాగమై యిరువది యొక్క వేల గ్రామములు గలిగియుండెను. శ్రీమన్మహామండలేశ్వరుండైన బల్లయచోడ మహారాజు కొట్యదొన రాజధానిగా బైజెప్పిన యిరువదియొక్క వేలుగల పాకనాటిని బరిపాలించుచుండెను. బల్లయచోడుని కొడుకు కామచోడుడని శాసనములలో చెప్పబడియుండుటచేత, నీ చోడబల్లి నన్నె చోడదేవుని తండ్రి కాడని సందేహింపవలసి వచ్చుచున్నది. అయినను నన్నెచోడుడు చోడబల్లి కగ్రమహిషియైన శ్రీపతికి దనూజుడనని పై పద్యములో జెప్పుకొనియుండుట చేత చోడబల్లికి బెక్కండ్రు భార్యలు గలరనియు, నన్నెచోడుడు పెద్దభార్య కొడుకనియు, కామచోడుడు మరియొక భార్యయొక్క తనయుడనియు, మనమూహింపవచ్చును. కమ్మనాటిలో నంతర్భాగమైయుండిన దర్శిసీమలోని మన్నేపల్లి గ్రామములో చోడబల్లియొక్క రెండు శాసనములు గానిపించుచున్నవి.