పుట:Andhrula Charitramu Part 2.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జైనబౌద్ధమతముల నిర్మూలనము.

అంతట జైనులకును వైష్ణవులకును ఘోరకలహము ప్రారంభమై మత చర్చలతి భయంకరములయ్యెను. మహారాజగు విష్ణువర్ధనుడు వైష్ణవుల పక్షముజేరినందునజైనుల బలముడిగిపోయెను. రామానుజుడు జైనమతాచార్యులను వాదమున గెలిచెనట. వైష్ణవపక్షపాతియై విష్ణువర్ధనుడు 790 జైన దేవాలయములను నాశనము చేసి అదివరకా దేవాలయముల పోషణార్తము దానము చేసిన మడులు, మాన్యములూడ బెరికికొని వైష్ణవ దేవాలయముల కైంకర్యాదుల కొసంగెను. విష్ణువర్ధనుడు బేలూరిలో చెన్నిగి నారాయణుని, తలక్కాడులో కీర్తినారాయణుని, గడగులో విజయనారాయణుని, హరదనహల్లిలో [1]లక్ష్మీనారాయణుని, మరియొకచోట మరియొక నారాయణుని ప్రతిష్ఠింపించి, తొండనూరిలో తిరుమలసాగర మను పేర నొక చెరువు త్రవ్వించి జైని దేవాలయముల రాలతో చీడీలు గట్టించి చెరువుగట్టు క్రింద రామానుజ కూటమును నెలకొల్పి భక్తుల పోషణార్థ మొక సత్రమును గూడ నిర్మించెను. దొడ్డగురునహల్లి గ్రామమునకు మేలుకోటయనియు, తిరునారాయణపురమనియు నామకరణము చేసెను. ఇయ్యది క్రీ.శ.1197వ సంవత్సరమున జరిగినదని శ్రావణబెలగోల స్థలపురాణము వలన దేటపడుచున్నది. వైష్ణవమతమవలంబింపని జైనమతాచార్యులనేకులు రాతి గానుగలలో బెట్టి చంపబడిరి. పద్మగిరిలో దిరుగబడిన జైనులనేకులు పై రీతిగానే సంహరింపబడిరి. [2]ఈ ఘోరప్రళమునకు భయపడి జైనమతావలంబకులనేకులు తప్తముద్రాధారణమును గైకొని వైష్ణవులయిరి. ఈ విషయములు స్థలపురాణములలోను, వైష్ణవమతగ్రంథములలోను వ్రాయబడినవి. ఇట్లని పై గ్రంథములలో జెప్పబడియున్న విష్ణువర్ధనుడు జైనుల సంబంధమును విడచిపెట్టినట్లు శాసనముల వలన దెలియలేదు. వైష్ణవమతావలంబకుడని చెప్పబడిన విష్ణువర్ధనుడు

  1. The Indian Antiquary, Vol.II. May. 1873
  2. Life and Teachings of Sri Ramanuja by C.R.Srinivasa Aiyengar B.A., p.215