పుట:Andhrula Charitramu Part 2.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు సిద్ధిరాజుచే గోరబడి తిక్కన తాను రచించిన నిర్వచనోత్తర రామాయణ కావ్యమునాతని కంకితము చేసెను. ఈ నిర్వచనోత్తర రామాయణము ప్రథమంబున రచింపబడినదగుటంజేసి కాబోలు నిందు దిక్కనార్యుడు తన పాండిత్యాతిశయమును దన కవిత్వనియమమును జెప్పుకొని కుకవినిందయు చేసియున్నాడు.ఇట్టిది యాంధ్రీకృత భారతమున గానరాదు. ఇతడు నిర్వచనోత్తర రామాయణము రచించునప్పటికి యజ్ఞము చేసియుండలేదనియు, వయస్సు మీరినవాడు కాడనియు, నిర్వచనోత్తరరామాయణములోని "ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త్రబుధారాధన విధేయ తిక్కన నామధేయ ప్రణీతంబైన"అను గద్యమునుబట్టియే మనము సులభముగా గ్రహింపవచ్చును. భారతము రచించునప్పటికీతడు యజ్ఞము చేసినటుల భారతములోని "ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కనసోమయాజి ప్రణీతంబైన" యను గద్యమునుబట్టియే విస్పష్టమగుచున్నది. నిర్వచనోత్తరరామాయణమున 1258వ సంవత్సరము వరకు జరిగిన విషయములను బేర్కొనియుండుట చేతను, అప్పటికి యజ్ఞము చేసి యుండలేదు గనుకను, భారతము మనుమసిద్ధి రాజునకంకితము చేయబడక హరినాధునకంకితము చేయబడి యుండుటచేతను భారతము మనుమసిద్ధి రాజు మరణానంతరము కొన్ని సంవత్సరములకు రచియించబడినదని చెప్పవలసియున్నది. ఈ మంత్రి పుంగవుడు మనుమసిద్ధి రాజునకు నతని సేనానియు దనకు బెదతండ్రి కొడుకునగు తిక్కనమంత్రియు మరణమునొందిన తరువాత విరక్తిభావము జనింప లౌకికాధికార ధూర్వహత్వమునుండి తొలగి వైదికమార్గనిష్ఠమగు వర్తనమునం బ్రీతిజనింప నగ్నిష్టోమ మను క్రతువు నాచరించి సోమయాజియై మహాభారతము రచించి జగద్విఖ్యాతిగాంచెను. ఇతడు లౌకికాధికార ధూర్వహుండై యున్న కాలముననే మహాభారతమును రచింపబూనుకొనెనను కేవలము బొరబాటుగాని వేరొండుకాదు.ఇతడు గణపతిదేవుని యాస్థానమునకుంబోయి భారతాఖ్యానమును వినిపించెననుటయు విశ్వాసపాత్రమైన విషయము గాదు. ఇమ్మహనీయుడు