సాంప్రదాయములను విశేషముగా గలిగియుండి భిన్నజాతులట్ల గన్పడెదరు గాని నిక్క మాలోచింప వీరెల్లరు నాంధ్రులే గాన వేఱుగా భావింపరాదు.
నాగరికత.
నదుల కానకట్టలు గట్టబడి కాలువలు త్రవ్వబడి దేశమునందంతట నదీజలములు ప్రవహింప జేయబడి యూషరక్షేత్రములు సహితము వరిపండునట్టి దివ్యక్షేత్రములుగా మార్పబడి నానా విధములయిన పంటలు పండింపబడుచున్నవి. ఇట్లు దేశము జలపూరితమై సర్వసస్యఫలప్రదం బగుటం జేసి జనాభివృద్ధిగలిగి వానితోఁబాటు పట్టణములు పల్లెలు ద్విగుణముగా త్రిగుణముగా నధికముగకాఁగా వాణిజ్యము హెచ్చినది. వాణిజ్యము హెచ్చినకొలది సౌకర్యము లెక్కువగ సమకూర్పఁబడినవి. మహానదులకు వంతెనలు గట్టబడి పర్వతములు దొలువబడి అయోమార్గములు నిర్మింపఁబడి పొగబండ్లు నడుపఁబడుచున్నవి. ప్రతి పెద్దపల్లెయందును లేఖావహన కార్యస్థానము (Post Office) నెల కొల్పబడినది. ప్రతిపట్టణనమునందును తంత్రులమూలముగా వార్తలను బంపు కార్యస్థానములు (Telegraph offices) నెలకొల్పఁబడినవి. బ్రిటీషుపాలనమున నాంధ్రులు విద్యాపరిజ్ఞానసంపన్నులై నానాట నాగరికతాభివృద్ధులనుగాంచి వర్థిల్లుచున్నారు. అభివృద్ధిఁ బడయుట కనుపయుక్తములగు సుగుణముల ననేకముల గలిగి యుండి యాత్మస్వాతంత్ర్యమునందభిలాష గలిగియుండియు నుద్రేకులుగాక ధైర్యముచూపవలసిన సత్కార్య సమయముల వెనుకంజవేయక శాంతమతులై నాగరికతయందు హిందూదేశమునందలి యేజాతివారికిని దీసిపోక సదా సంస్కరణాభిరతులయి మెలంగుచున్నారు. బ్రిటీషు పరిపాల నమునందింకను నత్యున్నస్థితి కాంధ్రులు వత్తురని విశ్వసించుటకుఁ బ్రబలహేతువు లనేకములు గలవు.
ఏదేశమిట్లు రమ్యహర్మ్యములతో నొప్పెడి పట్టణరాజములచేతను, పుష్పఫల భరితములగు నుద్యాన వనారామమలచే సొబగమీఱెడి పల్లెలచేతను, భూమిని సర్వసస్యాఢ్యగఁ జేయునట్టి మహానదీనదంబులచేతను, సారవంతములై సర్వసస్యాఢ్యములయిన సుక్షేత్రములచేతను, తామర తంపరయై