"సీ. నవకోటి వరిమతద్రవిణ మేభూపతి
భండారమున నెపుఁడుఁ బాయకుండు
నేకోవ శతదంతు లేరాజు ఘనశాల
నీలమేఘంబుల లీలఁగ్రాలు
బలవేగ రేఖ నల్వదివేల తురగంబు
లేనరేంద్రుని పాగ నెపుడు నిలుచుఁ
బ్రతివాసరంబు డెబ్బది యేనుపుట్ల నే
యే విభుమందల నెపుడుఁగలుగు
నట్టి సమధిక విభుఁడగు కులోత్తుంగ రా
జేంద్రచోళవిభుని కిష్టసచివ
తంత్రముఖ్యుడగుచు మంత్రి గోవిందనం
దనుఁడు కొమ్మన ప్రధానుఁడొప్పె."
ఈ నండూరి కొమ్మనమంత్రి యనేక తటాక దేవాలయ మహాగ్రహారములు నిర్మించి కీర్తి ప్రతిష్ఠలు గాంచినట్లు పై గ్రంథములోని యీ క్రిందిపద్యము చాటుచున్నది.
"చ. ఇల వెలనాటి చోడమనుజేంద్రునమాత్యతయానవాలుగాఁ
గులతిలకంబుగా మనినకొమ్మన ప్రెగ్గడ కీర్తిమాటలన్
దెలుపఁగ నేల తత్క్రియఁ బ్రతిష్ఠితమైన తటాక దేవతా
నిలయమహాగ్రహారములు నేడును నెల్లెడఁ దామచెప్పఁగన్."
రెండవగొంకరాజు.
వెలనాటి చోడుని మరణానంతరము వేగిదేశము పశ్చిమచాళుక్యరాజగు విక్రమాదిత్యునిచే జయింపబడియెను. విక్రమాదిత్యుడు వెలనాటిచోడుని కుమారుడగు మహామండలేశ్వర వెలనాటి గొంకయను (రెండవగొంకరాజు) రాజప్రతినిధిగ నియమించెను. విక్రమాదిత్యుని శాసనములు 1120-24 సంవ