త్సరముల నడుమని గొన్ని దాక్షారామమున గన్పట్టుచున్నవి. శాలివాహనశకము 1063వ సంవత్సరములోని వెలనాటిగొంకయ దానశాసనమొకటి దాక్షారామములోనువాని భార్య నబ్బాంబిక యొక్క దానశాసనమొకటి నాదెండ్లలోను గానంబడుచున్నవి. దాక్షారామశాసనములో "చాళుక్యరాజభవనమూల స్తంబు" డని గొంకరాజునకు బిరుదు నామముగా బేర్కొనబడియెను. కాబట్టి యితడు 1133 వ సంవత్సరమువఱకు పశ్చిమచాళుక్యులను రాజప్రతినిధిగనుండి మహేంద్రపర్వతము మొదలుకొని కాళహస్తివఱకుగల యాంధ్రదేశమును బరిపాలించినట్టు గన్పట్టుచున్నది. తరువాత విక్రమచోడుని శాసనములు చేబ్రొలు, నిడుబ్రోలు గ్రామములందు 1134-35సంవత్సరములలోనివి గన్పట్టుచుండుటచేత విక్రమచోడునిచే వేగిదేశము మరల స్వాధీనము జేసికొనబడియెనని యూహింపబడుచున్నది.
వెలనాటి వీరరాజేంద్రచోడుడు.
తరువాత రెండవగొంకరాజునకు నబ్బాంబిక యందు జనించిన వీరరాజేంద్రచోడుడు రాజ్యభారమును బూనెను. సారపిపురాధ్యక్షుండయిన తెలుంగుభీమనాయకుడు చోడుని యధికారమును ధిక్కరించి కొల్లేరు కోటలో దాగొనియుండ నితడు దండెత్తిపోయి వానితో యుద్ధముజేసి కోటధ్వంసముచేసి వానిని జంపెను. ఇప్పటి కృష్ణామండలములోని యేలూరు పట్టణ మాకాలమున సారసిపురమనియ, కమలాకర పురమనియు బిలువంబడుచుండెను. ఈ పట్టణమిప్పడు కొల్లేరుసరస్సునకు నైదు మైళ్లదూరమున నున్నను ఆ కాలమునందింకను కొల్లేరు సమీపముగనుండుటచేత నీ పట్టణమును సారసిపురమనుచుండిరి. తెలుగు నాయకులు దీనిని పరిపాలించుచుండిరి. వీరు స్వసంరక్షణార్థము కొల్లేరులో నొక కోటను గట్టుకొనియుండిరి. అదియిప్పుడు శిథిలమయిపోయినను ఆ ప్రదేశమిప్పటికిని కొల్లేరుకోట యనునామముతో బిలువంబడుచున్నది. ఈ భీమనాయకునకు ముందుండిన మఱియొక భీమనాయకుడు విక్రమచోడునిచే జంపబడియెను. [1] వీరలు వెలనాటి చోడులకు లోబడి పరిపాల
- ↑ Son. Ind. Ins. Vol II. p. 308.