పుట:Andhrula Charitramu Part-1.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగునవి ధాన్యకటకము నుండి ప్రతిష్టానపురము మీదుగా మెట్టదారిని భరుఖచ్చము రేవునకుంబోయి యచ్చట నుండి పశ్చిమ మండలముకుం బంపబడుచుండినవి. పశ్చిమ ఖండములనుండి వచ్చు సరకులుగూడ భరుఖచ్చమునుండి మెట్టదారిని ప్రతిష్టానపురము మీదుగానే ఈ దేశమునకు గొనిరాబడుచుండినవి.

రోము మొదలగు ఖండాంతరదేశములతోడ వ్యాపారము జరుగుచుండినందులకు దృష్టాంతము రోమచక్రవర్తుల నాణెము లీతీరమునందు చెల్లుబడి యగుచుండుటం గన్న మరియేమి కావయును. అట్టి రోమకనాణెములు రెండవ శతాబ్దములోనివి నెల్లూరుకు సమీపమున భూమిలోనుండి పెళ్ళగింపబడినవి.

నెల్లూరునకు సమీపమున నొక కాపు రాళ్ళ రప్పలతోగూ యయెక్కుటకసాధ్యముగా నుండిన యొక కొండ ప్రక్కను పొలము దున్నుచుండగా ఇటుకకట్టడమొకటి యడ్డము వచ్చినందున నతడు దానిని త్రవ్వి చూడగా యొకచిన్న దేవాలయమును బయల్పడెను. దానిలో యొక చిన్న మట్టి ముంత గానంబడియెను. ఆముంతలో రెండవ శతాబ్దములోని కొన్ని రోమకనాణెములును, బిరుదు బిళ్ళలును గానవచ్చెను. అతడు వానింగైకొని పాతబంగారము కింద వాని నమ్మెను. పెక్కునాణెములు కరిగింపబడినవి. కాని అమీరు-అల్-ఉమ్రా అనునవాబు వాని ముప్పదింటివరకును స్వాధీనము చేసికొని1783వ సంవత్సరము జూలయి నెలలో చెన్నపురి గవర్నరుగా నుండిన అలెగ్జాండరు డేవిడ్సన్ దొరగారికి బంపించెను.

వారు దానిలో అడ్రినా పౌష్టియను రోమన్ చక్రవర్తుల పేరులుగల రెండునాణెములు మాత్రము తీసికొనిరి. వానిలో ట్రజానుల నాణెములు మాత్రము సురక్షితములనియు, అవియన్నియు మేలిమిబంగారముతో పోతబోయబడినవనియు, కొన్నియాభరణములుగా నుపయోగించుకొనం బడుటచేత కాబోలు రూపములు చెడిపోయి యున్నవనియు వ్రాసియున్నారు. ఈ రోమకనాణెములు మనదేశములో దొరకుట చేత ఖండాంతర దేశములతో గూడ వర్తకము జరుగుచుండెనని మనము నిశ్చయింపవచ్చును. [1]

  1. Asiatic Researches vol. II pages 331,332