రాణి శాతవాహనుని మూర్ఖుడని యవమానించుట.
సాతవాహనుడొకనాడు దేవీకృతోద్యానమునకు రాణులతోగూడపోయి యచ్చట నందనవనమునందు కొంతసేపు విహరించి జలక్రీడార్థమై పద్మసరస్సులో బ్రవేశించెను. ఇట్లు రాజును రాణులును పద్మసరోవరము సొచ్చి యిచ్ఛావిలాసముగా నొండొరులమీద నీళ్ళు చల్లుకొనుచుండగా శిరీష కుసుమ సుకుమారాంగియగు నొక దేవి జలక్రీడచే బడలినదై తనపై రాజు నీళ్ళు జల్లుచుండ నోపలేక సంస్కృతభాషలో "రాజన్ మాం మోదకైస్తాడయ" అని వేడికొనెను. దానిని విని వెంటనే రాజు విస్తారముగా మోదకములు (మిఠాయి) తెప్పించెను; అంతట రాణి నవ్వి, "రాజా నీళ్ళలో మోదకముల ప్రసక్తియేమి? మా ఉదకై తాడయ"అనగా "నీళ్ళతో గొట్టకుము" అనిగదా వేడితిని. మాశబ్దోదక శబ్దముల సంధినిగూడ నెఱుంగకున్నాడవు; నీవేమి యింత మూర్ఖుండవుగానున్నాడవు" అని శబ్దశాస్త్రమునందు నిపుణురాలయిన యా రాణి పలికిన పలుకులను విని పరిజనులందఱును పక్కున నవ్వసాగిరి. అంతట సాతవాహనుడు మనస్సులో మిగుల లజ్జాక్రాంతుడై జలక్రీడను వెంటనే మాని యుత్సాహములేక తన బ్రతుకునకు విసుగుకొనుచు తన మందిరమునకు బోయెను. అతడు చింతాసక్తుడై భోజనముకూడ వర్జించి యెవరేమియడిగినను పటమునందలి బొమ్మవలె మాఱుమాటలేకయుండెను. పాండిత్యమో మరణమో రెంటిలో నొక్కటియె శరణమని పాన్పునంబడి పరితపించుచుండెను. రాజుయొక్క దురవస్థను గాంచి పరిజనులందఱును దిగులుపడియుండిరి. తరువాత నేనును శర్వవర్మయున క్రమముగానంతయు దెలిసికొని రాజహంసుడను రాజరక్షభటవర్గములోని వానినొకని బిలిచి రాజట్లుండుటకు గారణమేమియని యడిగితిమి. "ఏలినవారికింత మనోవ్యథ మున్నెన్నడిట్లు కలిగియుండలేదు; విష్ణుశక్తి కూతురు తన యల్పపాండిత్య గర్వము చేత నేలినవారిని నవమానించినదని తక్కిన రాణులు చెప్పినారు" అని చెప్పెను. ఈ మాటకు మేము మిక్కిలి చింతించితిమి. నేను శర్వవర్మతో నిట్లంటిని "రాజునకు వ్యాధియైన వైద్యులువచ్చి