Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుందురు; మనోవ్యాధియేని అందులకు కారణమగుపించదు; రాజ్యము నిష్కంటకముగానున్నది; శత్రువనుమాటయే లేదు; ప్రజలందఱు ననురక్తులైయున్నారు; ఎందును ఏ లోపమును గానరాదు; ఆకస్మికముగా నితనికింత ఖేదమేల కలిగినది" మహామతియైన శర్వవర్మ నా మాటలకిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "మిత్రుడా! నేను తెలిసికొంటిని; తాను మూర్ఖుడైనందులకు రాజు దుఃఖించుచున్నాడు; ఇతడు తాను మూర్ఖుడనని తెలిసికొని తనకెన్నడయిన పాండిత్యమబ్బునాయని సార్వకాలము నపేక్షించుచుండును. ఆ మూర్ఖతకై రాణి యవమానపఱచెనని యిప్పుడేగదా విన్నారము". ఇట్లొకరితోనొకర మాలోచించుకొని యింటికిబోయి మఱునాడు ప్రాతఃకాలమున రాజనగరుకు పోయితిమి. ఎవ్వరును లోనికిరాగూడదని యాజ్ఞయైయున్నను ఏదో యుపాయముపన్ని మేమిరువురమును లోపల బ్రవేశించితిమి. నేను రాజు దగ్గఱకు బోయి కూరుచుండి "దేవా! ఏలయిట్లు నిష్కారణము ఖేదపడుచున్నాడవు"అని యడిగితిని గాని అతడు యధాప్రకారము ప్రత్యుత్తరము చెప్పక మౌనము వహించియుండెను. అంతట శర్వవర్మ "దేవా! ఎట్లయినను నాకు విద్య లభించునాయని నీవు పూర్వము నన్నడిగియుంటివి; అందు నిమిత్తమై నేను స్వప్నమాణవకుని చేసితిని; స్వప్నములో నాకాశమునుండి యొక కమలము రాలినది. దానిని దివ్యకొమారుడొకడు వికసిల్లజేసెను. అంతనాకమలమునుండి తెల్లని వలిష్ఠము దాల్చిన యొక దివ్యస్త్రీ బయలువెడలి వెంటనే నీ నోట ప్రవేశించినది. ఇట్లు కలగని మేలుకొంటిని; ఆమె సాక్షాత్తు సరస్వతియె నిస్సంశయముగా నీ నోట ప్రవేశించినది" అని యిట్లద్భుతవాక్యమును పలికెను. ఈ చల్లని పలుకులు చెవినిబడిన తోడనే సాతవాహనుండు మౌనము విడిచి సాభిప్రాయముగా "అయ్యా! శ్రద్ధతో చదువు చెప్పిన యెడల పురుషునికి పాండిత్య మెంత కాలమునకు గలుగునో చెప్పుము; విద్యలేక యీ నా సిరి శోభింపకయున్నది; కొయ్యకు తొడవులంబోలె మూర్ఖునికి నైశ్వర్యములెందుకు?" అని పలికెను. అంతట నేనును "లోకములో సర్వ విద్యలకును ముఖ్యమయిన వ్యాకరణమును పండ్రెండు సంవత్సరములలో మనుష్యులు గ్రహింతురు; ఓ దేవా! నేనా వ్యాకరణమును నీకాఱు సంవత్సరములలో నేర్పెదను"