Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవ ప్రకరణము

బుద్ధునికాలము.

(క్రీ.పూ.557 మొదలుకొని 477 వఱకు.)

క్రీస్తు పుట్టుటకు మున్నారవ శతాబ్దమున భరతఖండమునకు శిరోభూషణముగానుండిన మగధ రాజ్యమును శిశునాగవంశజుడయిన యజాతశత్రువు పరిపాలించుచుండెననియు శిశునాగ వంశజులనార్యులయిన నాగకులులుగాని యార్యులుగారనియు పూర్వప్రకరణమున జెప్పియుంటిమి. ఈతని కాలమున రాజగృహమనియెడి పట్టణము మగధదేశమునకు రాజధానిగనుండెను. ఈ యజాతశత్రుని తండ్రియగు బింబిసారుని కాలమున గౌతమబుద్ధుడు జనించెను. మహాత్ముడును విరాగియునైన యితడాకాలమునందలి మతసంస్కర్తలలోనే గాక భరతఖండమున నేటివరకు జనించిన మతసంస్కర్తలందఱిలోను నగ్రగణ్యుడనుటకు సందియములేదు.తత్వవిచారము జనసామాన్యమునకు బోధపడనందున నీతివర్తనమే యందఱికి ముఖ్యమనియు, పరిశుద్ధములయిన మనోవాక్కాయకర్మములు నిర్వాణమునకు ముఖ్యసాధనములనియు, పరోపకారమును భూతదయయు ధర్మముయొక్క ముఖ్యాంగములనియు, ఇవి జాతి భేదములేక యందఱకును సాధ్యములనియు, బ్రాహ్మణునికాధిక్యమును శూద్రునికి నీచత్వమును లేక సత్ర్పవర్తన గలవారెల్లరును బూజనీయులేయనియు, ధర్మనీతితత్త్వమును బోధించెను. ఈ బుద్ధధర్మము బహుశీఘ్రకాలములోనే దేశదేశముల వ్యాపించెను. భగవంతుడనార్య జాతుల నుద్ధరించుటకై ఈ రూపమున నవతరించెనని ప్రజలు విశ్వసించి బుద్ధుని మతము నవలంబించుచుండిరి. ఈ బుద్ధధర్మమార్యులకంటెను అనార్యులచే నెక్కుడుగ నాదరింపబడుచువచ్చెను. ఈ బుద్ధభగవానుడు క్రీ.పూ.557వ సంవత్సరమున జనించి యెనుబది సంవత్సరములు జీవింపగలిగి 477వ సంవత్సరమున నిర్వాణముజెందెను. ఈ కాలమున మన యాంధ్రదేశ మనార్యులయిన