Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగరాజుల వశమునందుండెను. వీరలార్యులవలెనంతగా నాగరికులు గాకపోయినను గొంతవఱకు నాగరికత నహించినవారగుట వలన నార్యులరాకకు బూర్వమె దండకారణ్యమున రాజ్యమును స్థాపింపగలిగిరి. ఆర్యులీకాలముననే యనార్యాంధ్రదేశమున బ్రవేశించి తమ నాగరికత ననార్యాంధ్రులకు జవిచూపుచుండిరి. అయిన నార్యావర్తమునందువలె నీయనార్యాంధ్రులార్యమతమును సంపూర్ణముగ నవలంబించి యుండలేదు. అప్పుడీ దేశమాంధ్రదేశమని యార్యులచేతను; మంజీరదేశమనియు, వజ్రభూమియనియు బౌద్ధులచేతను; నాగులదేశమని యనార్యులచేతను బిలువబడుచుండెను. ఆ కాలమునందనార్యాంధ్రులు బౌద్ధమతమును సంపూర్ణముగ నవలంబించినవారు గాకపోయినను బుద్ధభగవానునియెడ భక్తివిశ్వాసములను గలిగియుండిరి. అనార్యాంధ్రులయిన నాగరాజులకు నార్యమతముకంటెను బౌద్ధమతమునందు బ్రేమయెక్కుడుగనుండుచు వచ్చెను. ఈ దేశమును బాలించెడి నాగరాజొకడు గౌతమబుద్ధుని సందర్శించెనని బౌద్ధుల గాథలయందు దెల్పబడుటయే యీ యంశము ధ్రువపడుచున్నది. ఆ కాలమునందు నీయాంధ్రదేశమును బాలించెడి నాగరాజులకును నాగద్వీపమును బాలించెడి నాగరాజులకును విశేషమైత్రి గలిగియుండెను. రాక్షస నివాసభూమిగ నుండిన లంకాద్వీప మాకాలమున నాగద్వీపమనియు, రత్నద్వీపమనియు బిలువబడుచుండెను. అదియె యిటీవల సింహళద్వీపమని గూడ పిలువంబడుచుండెను. ఈ నాగద్వీపమునకు నాగనివాసభూమియైన యీ మంజీరదేశమునకును సముద్ర మార్గమున వర్తకవ్యాపారము విశేషముగ జరుగుచుండెను. ఆ కాలమునందు కృష్ణానదీ ముఖద్వారమునందొక ముఖ్యమయిన రేవు పట్టణమున్నట్లుగా నా కాలపు జర్యలను దెలిపెడి బౌద్ధుల గాథలవలన దేటపడుచున్నది. ఇప్పుడు మహానదికిని గోదావరికి నడుమనుండు నాంధ్రదేశ భాగమాకాలమున గళింగదేశముగా వ్యవహరింపబడుచుండెను. ఆ కాలమునందు నెల్లూరు గుత్తి, కడప, కందవోలు మండలములును కృష్ణానదికి దిగువనుండు దేశమును కృష్ణాగోదావరుల నడుమనుండు దేశమును వజ్రభూమిగా (Diamond fields) వ్యవహారమునందుండెను. ఆ కాలమునందు నాంధ్రదేశమునందలి జనులును, కళిం