దీని నంతయు నెఱింగినవాడనైనను, ఏ యేమంచి పనులం జేసి మనపూర్వులు లాభమును సౌఖ్యమును బ్రఖ్యాతిని గాంచ గలిగిరో, ఏయేకాని పనులం జేసి నష్టమును గష్టమును నపఖ్యాతి ననుభవించిరో యుద్ధములోని నిజస్వరూపమునుబోలె దెలిసికొనునట్లుగజేసి పురోభివృద్ధికై సంస్కరణమార్గములను జూసి సంరక్షించునని దేశచరిత్రంబు లని మనంబున దృఢవిశ్వాసమునుబూని యున్నవాడగుటచేత నాశక్తిసామర్ధ్యముల నాలోచింపకయె నేనీగ్రంథరచనకుం బూనుకొంటిని.
యథార్ధచరిత్రమునకు బ్రతిబంధకములు.
ఇట్లు చరిత్రరచనకుం బూనుకొని ముందుగ మనప్రాచీనగ్రంథపరిశోధనకుం గడంగిన యథార్ధచరిత్రమునకు ప్రతిబంధకము లనేకములు గన్పట్టినవి. ప్రాచీనమైనదానియందు జనసామాన్యమునకు గౌరవబుద్ధి యత్యధికముగా నుండుటచేత తమతమ మతములును తమతమ కులములును మిక్కిలి ప్రాచీనములయినవగుటచే ఘనమైనవనియు లోకమునకు వ్యక్తీకరింపనెంచి మతాభిమానులును, కులాభిమానులును, తమకుం గల గాఢాభిమానముచే దమదేశమును తమభాషలును మిక్కిలి పురాతనమైన వగుటచే ఘనమైనవనియు లోకమునకు వ్యక్తీకరింపనెంచి దేశాభిమానులును, దేశముయొక్క యథార్ధచరిత్రమును దెలిసికొనుటకు నైతిగాకుండ బ్రాచీనగ్రంధములలో గ్రొత్తగ నవీన విషయములను జేర్చియు నూత్నగ్రంధములను, నూత్నకథల్ను గల్పించియు జిక్కులను బెక్కింటినుత్పాదించిరి. క్షేత్రమహాత్మ్యములను, నదీమహాత్మ్యములను, స్థలపురాణములను బుట్టించిరి. కల్పితకథల నెన్నో యల్లిరి. వేయునేల?