పుట:Andhravijnanasarvasvamupart2.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుల - 1. సింహళదేశపు రాజైన మహానాగుని భార్య. మహాను డశోకచక్రవర్తికి సమకాలీను డని చెప్పెదరు. సింహళమున బౌద్ధధర్మమును వ్యాపింపజేయుటకు నీమె పాటుపడెను. ఈమెకు బౌద్ధమతజ్నాన మధికముగ నుండెను. ఈమె ఆడుబిడ్డ పేరు సంఘమిత్ర. ఈమెకు బౌద్ధమతమునందు గల విశేషజ్నానమును బట్టి సంఘమిత్ర యీమెను ' ఆచార్య ' యని పిలుచుచుండెను. 2. సింహళపతియైన కొరాంగరాజు భార్య. దురాచరణము కలగి. తన పతి యగు కొరాంగుని, పుర్తు డగు తిష్యుని, నలుగురు ఉపపతులను విషము పెట్టి చంపెను. ఈమె రాజ్యము చేయుచుండగ నీమె మరది కుమారుడైన కాలకంఠిష్యుడనువాడు తిరుగబడి ఈమెను చంపి రాజయ్యెను (క్రీ.పూ. 41).

అనులు - వేదకాలమందు పరుష్ణి నదీతటమున నున్న జనులకు బేరు.

అనులోమము (అనులోమ వివాహము) - ఎక్కువజాతి పురుషులు తక్కువజాతి స్త్రీలను వివాహ మాడిన నది అనులోమవివాహ మనిపించుకొనును. బ్రాహ్మణుడు క్షత్త్రియ వైశ్య శూద్ర స్త్రీలను, క్షత్త్రియుడు వైశ్య శూద్ర స్త్రీలను, వైశ్యుడు శూద్ర స్త్రీని వివాహ మాడిన ' అనులోమవివాహ ' మగును. దీనికి విరోధశబ్దము ' ప్రతిలోమవివాహ ' మనునది. తక్కువజాతి పురుషులు ఎక్కువజాతి స్త్రీలను పెండ్లి చేసికొనుట ప్రతిలోమము. హిందూ ధర్మశాస్త్ర మతమున ప్రతిలోమ వివాహములు ఎల్లప్పుడును గర్హితములు. అనులోమవివాహములు పూర్వయుగములయందు జెల్లినవి. కాని కలియుగమునందు నవియు నిషిద్ధములే. ఇప్పు డమలులో నున్న ఆచారము ప్రకారమును, కోర్టువారిచే నొప్పుకొనబడిన ' హిందూ లా ' ప్రకారము అనులోమ, ప్రతిలోమ వివాహము లన్నియు నిషిద్ధములే. ఆచారము ననుసరించి యేజాతివా రాజాతిలోనే వివాహము చేసికొనవలెను. అట్లు చేసికొనక మరియొక జాతితో సంబంధము కలుగుజేసికొన్న యెడల నా వివాహము చెల్లదు; అనగా వ్యవహారము కోర్టునకు వచ్చినప్పుడు, కోర్టువా రట్టి వివహితస్త్రీని దాసిగను, దాని సంతతిని దాసీపుత్రులుగను భావించెదరు.

ఇట్లు సామాన్యముగ అనులోమ, ప్రతిలోమ వివాహము లిప్పుడు లేకపోయినను, ఒక విధమైన యనులోమపద్ధతి యిప్పటికిని హిందూ దేశమునం దున్నది. బంగాళదేశమునందు బ్రాహ్మణులలో కులీనులు, దేశీయులు మొదలయిన భేదములు కలవు. వారిలో కులీనులు అందరకంటె నెక్కువవార మని చెప్పుకొనియెదరు. వీరు తమకంటె దక్కువవ రగు బ్రహ్మణులయింటి ఆడుపిల్లలను చేసికొందురు. తమ ఆడుపిల్లలను వారి కీయరు. అట్లే మనదేశమందు మధ్వులు, లింగధారు లయిన ఆరాధ్యులు, తా మితర బ్రాహ్మణులకంటె నెక్కువవారమని కాబోలు, స్మార్తబ్రాహ్మణులయింటి యాడుపడుచులను వివాహమాడెదరు. కాని తమ యాడుపడుచులను స్మార్తుల కీయరు. కావున