పుట:Andhraveerulupar025958mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలుని గనెను. బాలుని జూడగనే ప్రేమకలిగి బ్రహ్మనాయని కొసంగుదునని మ్రొక్కుకొన్నసంగతి మఱచి తానె పెంచుచుండెను. బాలునకు గొన్నాళ్లకు గొప్ప వ్యాధివచ్చెను. స్వప్నమున నొకపురుషుడు కనిపించి నీవాడినమాట తప్పుటచే గుమారునకు రోగమువచ్చినది. నీమాట చెల్లించుకొందువేని కుమారుడు చిరంజీవి కాగలడని చెప్పెను. పంచమాంగనకు వెంటనే బ్రహ్మనాయని పాదములయందు బడ వేయుదునన్న మాట జ్ఞాపకమునకు వచ్చి ఆరోగ్యము కలుగ గానే వాగ్దానము నెఱవేర్చుకొందునని మ్రొక్కుకొనగా బాలునకు దినక్రమమున ఆరోగ్యము కలిగెను. పంచమకాంత ఒక శుభముహూర్తమున బాలుని గొనిపోయి బ్రహ్మనాయని పాదములముందుంచి యిటుల విన్నవించెను. "మహారాజా! నీవరప్రభావమున నాకీకుమారుడు జనించినాడు. బాలుడు జనించినచో నీపాదములమీద వేయుదునని మొక్కుకొని మఱచితిని. అందుచే దీరని వ్యాధులవలన నిన్న మొన్నటివరకు నవిసినాడు. నావాగ్దానము నెరవేర్ప నుంటిననిమ్రొక్కుకొనగా బ్రతికినాడు. నేనుకన్నంతమాత్రమున దల్లినికాను. నీధర్మపత్నియగు ఐతమ్మయే యీబాలునకు దల్లి. మీరే తండ్రి. బాలునిపోషించు భారముమీది" ఇట్లువిన్నవింపగనే నాయ డానందమొంది బాలుని గై కొని శిరముమూర్కొని పెంచుకొనుమని ధర్మపత్ని కొసంగెను. ఆయమయు బంచమ