పుట:Andhraveerulupar025958mbp.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మమునకు సర్వసిద్ధముగ నుండిరి. బలములన్నియు నాయితము గావింపబడియెను. విజయదుందుభులు దింగతరముల మాఱుమ్రోగు చుండ నొకానొక శుభముహూర్తమున వీరచూడామణి యగు మాధవవర్మ పితృతుల్యుడగు మాధవశర్మ పెట్టిన శుభముహూర్తమున విజయయాత్రకు బయన మయ్యెను. అనుకూల మృదులముగ వీచు పవమాన మా రాజన్యునకు సుస్వాగతము నొసంగెను. ప్రకృతియంతయు విజయచిహ్నముల సూచించుచుండెను. మాతృదేవీదత్తమగు శుభాశీర్వాదాదికము పరిగ్రహించి పద్మాక్షిదేవి ప్రదత్తములగు దివ్యాయుధములు ధరించి పుణ్యకాంతులు హర్మ్యాగ్రముల నుండి పుష్పాక్షతలు చల్లుచుండ గటకముపైకి సమస్త బలముతో మాధవవర్మ జైత్రయాత్రకు బయలువెడలెను. సామంతాదు లందఱు విధేయులై రాజన్యున కెదురేగి యుచితసత్కారములుగావించి చతురంగసేనల శక్తికొలది సహాయము గావించిరి. అపరిమిత బలముతో బయలువెడలి మాధవవర్మ కొన్నిమాసములకు బ్రత్యర్థిరాజ్యమగు కటకము చేరెను. సైనికులందఱు శిబిరముల నెలకొల్పికొనిరి. సేనానాయకులు సంగరమునకు సర్వసిద్ధముగ నుండిరి. కోపతీవ్రముచే బ్రత్యర్థి సంహరణ దివ్యాకాలము కొఱకు నిరీక్షించుచున్న మాధవవర్మ గూఢచారుల వలన గటకరాజ్యపరిస్థితులు, బలాదికములు రహస్యముగ నెఱింగి వ్యూహాదికముల నిర్ణయించి తెల్లవాఱున: