పుట:Andhraveerulupar025958mbp.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజులందఱు కుట్ర చేయుచుండిరి. సీతారామరాజు కంపెనీ వారితో గలిసి దూరాలోచనలు గావించి తమపై పితూరి చేయుచున్న జమీందారుల నందఱను జయించెను. జయపురపు కోట నాక్రమించుకొనెను. ఇంకను బ్రతికూలురని యనుమానముతోచిన రాజులనందఱను గారాగృహములం దుంచెను. చండశాసనుడై దండనీతిని దీవ్రముగా నుపయోగించు సీతారామరాజునెడ సమకాలికులయసూయ మిగుల వృద్ధియయ్యెను. ఆతనిసాహసకృత్యములు కంపెనీవారికి గూడ సహింపరానివిగా నుండెను. సాటిరాజులందఱు విజయరామరాజునకు 'సీతారామరాజును మంత్రిపదవినుండి తొలగింపవలయు, లేకున్నచో మేము ప్రతిపక్షులుగా నుందు'మని వర్తమానములంపిరి. ఇవియన్నియు మనస్సునం దుంచుకొని విజయరామరాజు సీతారామరాజున కేమేమియోచెప్పి మంత్రిపదవికి రాజీనామ యిప్పించెను. సీతారామరాజునకు గుమారులు గలరు. విజయరామరాజునకు బుత్రసంతానము లేదు. విజయరామరాజునకు బుత్రసంతానము కలుగకపోయినచో తన కుమారుడగు నరసింహ గజపతిరాజును బెంచుకొందునని వాగ్దానము గావించుటచేతనే సీతారామరాజు రాజీనామనుబెట్టి యుద్యోగము మానుకొనెనని కొంద ఱందురు.

క్రీ.శ. 1778 లో దొరతనమువారు జమీందారులకు భూస్థితియు ఆదాయము ఎంతయున్నదో నిర్ణయించుకొని