పుట:Andhraveerulupar025903mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యువకుడు పండితవతంసుడు నందరాజుల సభకువచ్చి యటగల యొక యున్నతాసనమున నాసీనుడై యుండెను. నందు లచటకువచ్చి యుత్తమ పీఠమునందున్న యాపేదబాపని మిగుల దిరస్కారభావముతో జూచి సింహాసనమునుండి పడ లాగిరి. అమాత్యరాక్షసుం డిది యక్రమమనియు బండితులు పూజనీయులనియు బోధించెను కాని లాభములేకపోయెను. సిగముడి వీడ నున్న తాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులను గోపముతో దేఱి పాఱజూచి "ఓ నందాధము లారా! బహుజనమధ్యమునందు నన్నిటల అవమానించితిరి. మిమ్మిటులే సింహాసనమునుండి లాగి మీతలలను నరికి మీచే నూడ దీయబడిన యీ తలవెండ్రుకల ముడి వేసు కొనను" అని సభామందిరమును వదలి వెడలిపోయెను.

చాణక్యు డిటుల గోపించి పోవుటజూచి చంద్రగుప్తుడు మాఱుత్రోవను బోయి యొక యేకాంత ప్రదేశమున జాణక్యుని గలిసికొని సాగిలి నమస్కరించి నందాదులచే దానొందు నవస్థల దెలిపి తన్నను గ్రహింపుమని వేడుకొనెను. చంద్రగుప్తుని లేవనెత్తి చాణక్యు డాదరించి నందరాజ్యమునకు నిన్ను బట్టాభిషిక్తునిగావించుట నారెండవ ప్రతిజ్ఞయని నాడు మొదలు చంద్రగుప్తుని తనయొద్దనే యుంచుకొని నందకుల నిర్మూలమునకై ప్రయత్నములు చేయుచుండెను.