పుట:Andhraveerulupar025903mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్యుడు జయించిన రాజ్యమున బ్రవేశింప నగరబహిర్భాగమున బరిజనముతో విడిసి యుండెను.

రాక్షసు డెటులేని జంద్రగుప్తుని జాణక్యుని జంప దలంచి మాయోపాయములు దక్క వేఱు గతిలేదని యొక యుపాయము పన్నెను. రాక్షసు డొకబాలికను విస మలవాటు చేసి పెంచుచుండెను. ఆబాలిక విసము జీర్ణించుకొనుట కలవాటుపడి యౌవనవతియై సర్వాంగసుందరియై యుండెను. ఆసుందరి తాకినయెడ విసముసోకి మనుజులు మరణింతురు. ఆమెను బిలువనంపి రప్పించి తనచెంత విశ్వాసపాత్రునివలె క్షపణకవేషథారియై వర్తించుచు జీవసిద్ధియను పేరుతోనున్న ఇందుశర్మను బిలిచి యీబాలికను జంద్రగుప్తునకు నేను సమర్పించితి ననియు బరిగ్రహించి మమ్ముల ననుగ్రహింపు మనియు జెప్పి పంపెను. జీవసిద్ధి 'చిత్త మటులనే కావింతు'నని విసకన్యను వెంటగొని చాణక్యునికడకు బోయి జరిగిన యుదంత మంతయు రహస్యముగా దెలిపి విషకన్యను సమర్పించెను. నందరాజ్యము నంతయు హరింపనెంచిన పర్వతరాజును జంప నిదియ తరుణమని చాణక్యుడు విషకన్యను బర్వతరాజునొద్దకు బంపెను. కామాతురుడగు పర్వతరాజు విషకన్యనుజూడగనే యొడలుప్పొంగి కౌగిలించుకొని విషము తల కెక్కి మరణించెను. రాక్షసుని యాన యడుగంటెను. నందరాజ్యమునంతయు హరింపదలంచిన పర్వతేశ్వరుడు గతించుట చాణక్యుని సంకల్పమునకు సర్వవిధముల సహాయకారి యయ్యెను.