పుట:Andhra bhasha charitramu part 1.pdf/844

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


      "కవదొన లేల పూనునొకొ కవ్వడి నావల దుగ్రసంగరో
       త్సవమున సవ్యపాణి నపసవ్యకరంబున మార్చి మార్చి గాం
       డివముధరింపగా శరపటిష్ఠతయుం బొరిజేయిమార్చి చూ
       పు వెరవుతోన వీడ్వడక పొందొడగూడెడు నెప్డు సూచినన్"- [విరా. V. 45.]

"ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే, తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదు:" అని సంస్కృత భారతమందున్నది. ఈ యార్థమును తిక్కన యొప్పుకొనక సవ్యసాచి పదమున కెడమచేతివాడి గలవాడనియే నిర్ధారించినాడు. "కవదొన" లను పై పద్యమువలన కవదొనలను బూనియర్జునుడు రెండుచేతులను భాణములను వదలుటవలన గవ్వడి యనబడుచున్నాడను నభిప్రాయము వ్యక్తము కాదు. తిక్కన 'కవ్వడి' యను పదమును 'సవ్యసాచి' పదమునకు బర్యాయపదముగా నుపయోగింపలేదనుటకొక్క యుదాహరణము చాలును. అర్జునుడు యతి రూపమున సుభద్రకడ నున్నప్పుడామె:

      "అలినీలకుంతలుం డనియును, హరినీలసమవర్ణుడనియు, నాజానులంబ
       తాయతస్థిరబాహు డనియు, నా రక్తాంత నలినదళాకార నయనుడనియు,
       నుత్తుంగఘన విశాలోరస్కుడనియును, 'గవ్వడి" యనియును గరము వేడ్క
       వివ్వచ్చు నెప్పుడు వినియెడునది దన వినినట్లయతిజూచి, వీడు విజయు
       డొక్కొయనుచు సంశయోపేతచిత్తయై యుండి, యుండనోప కొక్క నాడు
       భోజనాపసానమునున్న యమ్ముని కిందువదన ప్రీతి నిట్టులనియె" [ఆది. VIII.185]

సుభద్ర పైసందర్భమునం దర్జునుని యాకారమును వర్ణించుచున్నది. కవపడితన మాకారము కాజాలదు గదా. రెండు చేతులందును గణకిణాంకములను జూచి కాని, భుజములపై నున్న యమ్ముల పొదుల గుర్తును చూచికాని, సుభద్ర యాతని కవపడితనము నూహించెనందుమేని నామె కాతడు కపటయతి యగుట మొదటనే తెలిసియుండును; అట్లు జరుగ లేదు. కావున నామె యాతని యాకారమున కొక లక్షణమయిన కవ్వడితనమును చూచినదని చెప్పవలెను. ఇచ్చట చిన్న విశేషమున్నది. సంస్కృత భారతమున నర్జునుడు కపటయతివేషము వేసికొన్నట్టుగాని, సుభద్ర యాతనికి సేవచేసినట్టుకాని చెప్పబడియుండలేదు. అర్జునుని ద్వారక యందున్నవా రందఱును నర్జునుడనియే భావించిరి. కృష్ణుడు పంపిన రథముపై సుభద్ర పోయి రైవతాద్రిని పూజించి ద్వారకకు తిరిగి వచ్చు దారిలో నర్జును డామె నెత్తికొనిపోయినట్లు సంస్కృత భారతము చెప్పుచున్నది. అర్జునుని కపటయతివేష కథకు మూలము మృగ్యము.