పుట:Andhra bhasha charitramu part 1.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము

సంధి

సంస్కృత సంధి

తెనుగునకు గావలసిన సంస్కృత సంధిసూత్రములు

తెనుగున సంస్కృత సమాసములు గ్రంధములందు విరివిగజేరినవి. కొన్ని సమాసములు వ్యవహారము నందును వినవచ్చుచున్నవి. సంస్కృతపదములు సమసించునపుడు గలుగు సంధివిధానము తెనుగునకు గావలసినంత మట్టుకు తెలిసికొనవలసియున్నది. అట్టి సంధు లీక్రింద వివరింప బడినవి:-

అచ్సంధి.

(1) ఇ, ఉ, ఋ, ఌ, అనునచ్చుల కసవర్ణాచ్చులు పరమైనప్పుడు వానికి వరుసగా య, వ, ర, ల, అను హల్లు లాదేశములగును:1

అతి + ఆశ్చర్యము = అత్యాశ్చర్యము; గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ; పితృ + ఆదేశము = పిత్రాదేశము (ఌ + ఆకృతి = లాకృతి).

(2) క్షయ్య, జయ్య, శబ్దములు శక్యార్థములు:2 క్షయింప శక్యమైనది క్షయ్యము: జయింప శక్యమైనది జయ్యము. శక్యార్థముకాక యోగ్యార్థము గలిగినప్పుడు క్షేయము, జేయము, అనురూపములు గలుగును.

(3) 'క్రయ్యమనగా కొనువారు కొందురనుబుద్ధి నంగడియం దుంచబడినది. 'క్రేయ' మనగా విక్రయించుట కర్హమైనది.3

(4) అవర్ణమున కసవర్ణాచ్చు పరమైనయెడల నారెండచ్చుల స్థానమున పరమందున్న యచ్చునకు సంబంధించిన గుణమాదేశమగును:4 ఇ, ఉ, ఋ, ఌ, లకు వరుసగా ఏ, ఓ, అర్, అల్, అనునవి గుణములగును:

ఉప + ఇంద్రుడు = ఉపేంద్రుడు, గంగా + ఉదకము = గంగోదకము; మహా + ఋషి = మహర్షి.

(5) అవర్ణమునకు ఏ, ఐ, ఓ, ఔ, లు పరమైనయెడల వానికి వృద్ధి యేకాదేశమగును.5 ఇ, ఉ, ఋ, ఌ, లకు వరుసగా ఐ, ఔ, ఆర్, ఆల్, అనునవి వృద్ధులగును:

____________________________________________________________________

1.ఇకో య ణచి. 2. క్షయ్యజయ్యౌ శక్యార్థే 3. క్రయ్యస్తదర్థే 4. అద్గుణ: 5. వృద్ధిరేచి.