పుట:Andhra bhasha charitramu part 1.pdf/379

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఘోషము, అఘోషము, అను పదముల కర్థమేమో స్పష్టముకాకున్నది. ఇంగ్లీషులోని Aspirate అనుదానికి ఘోషమనియు, Unaspirate అనుదాని కఘోషమనియు నర్థము చెప్పినచో ఒత్తక్షరములు ఘోషములును సాధు అక్షరములు అఘోషములనని చెప్పవలసియుండును. అప్పుడు ఖ, ఛ, ఠ, థ; ఫ, ఘ, ఝ, డ, ధ, భ-లు ఘోషములును అగును. కాని, శ్వాసముగల ధ్వనులన్నియు నఘోషములనియు, నాదముగలవన్నియు ఘోషములనియు సిద్ధాంతకౌముది తెలుపుచున్నది. ఇదిగాక క, చ, ట. త, ప, ; గ, జ, డ, ద, బ, లు అల్పప్రాణములనియు, ఖ, ఛ, ర, ధ, ఫ; ఘ, ఝ, డ, ధ, భ, లు మహాప్రాణములనియు నాగ్రంధమే తెలుపుచున్నది. కావున నల్పప్రాణ, మహాప్రాణములకు వరుసగ Unaspirate , Aspirate , అని యింగ్లీషున జెప్పినయెడల ఘోషామహాప్రాణములకును అఘోషాల్పప్రాణములకును భేదములేకపోవును. కావున నిపుడు తేలవలసినది శ్వాసాఘోషములకును, నాదఘోషములకునుగల యర్థభేదము. ఈ భేదమేమో నిర్ణయించుట కష్టమే. ఈ జంటలలోని రెండు పదములు నేకార్థకములైన యెడల, వానిని వేర్వేఱ నుగ్గడించుట యనావశ్యకము. నాదమను నది ప్రయత్నము, ఘోషము దానిఫలము; శ్వాసము ప్రయత్నము, అఘోషము దాని ఫలము; - అని చెప్పినచో ఘో షాఘోషములను బ్రయత్నములలో జేర్చుట తగదు.

క, ప, హ, లను మహాప్రాణములని యనగూడినను, శ, ష, స, లు గూడ మహాప్రాణములనుట తగునేమో విచారణీయము. కాని, అల్పప్రాణముల నుచ్చరించు నప్పటికంటె శ, ష, స, లను నుచ్చరించునపు డెక్కువ ప్రాణము నుపయోగింపవలయుననుట స్పష్టము.

II.ఆచ్ఛికధ్వనులు.

ఆంధ్రధ్వనుల స్థాన, కరణ, ప్రయత్నములు తత్సమ శబ్దములందు సంస్కృత ధ్వనులకువలె నుండునుగాని, తద్భవ దేశ్యములందు కొన్నివర్ణముల విషయమున గొంత భేదముండును. ఎ, ఒ,ౘ, ౙ, ఱ, అను వర్ణముల విషయమున నీ భేదము కానవచ్చును. సంస్కృతమున ఎ, ఒ, లు దీర్ఘములేకాని హ్రస్వములుకావు. ప్రాకృతభాషల యస్వస్థనుండియు హ్రస్వ ఎ, ఒ కారములు ప్రచారములోనికి వచ్చినవి. ప్రాకృతమున ద్విత్వహల్లులకు పూర్వమందే హ్రస్వ ఎ, ఒ లుండు నని కొంద ఱందురుగాని, ప్రత్యేకముగ నున్నప్పుడును నవి హ్రస్వముగ వినబడుట కలదనుటకు నిదర్శనములు గలవు. ౘ, ౙ, లు దంత్యములగు ప్రత్యేకవర్ణములని వైయాకరణులందురు. కాని, యవిత-కార స-కార సంయోగమువలనను, దకార జ-కార సంయోగము