పుట:Andhra bhasha charitramu part 1.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ళ' కారము సంస్కృతమునలేదని యొకమతము. సంయుక్తాక్షరమగు 'క్ష' కారము సంయుక్తవర్ణముగా వినబడక పోవుటచే దానిని బ్రత్యేకవర్ణముగ గొందఱు పరిగణించిరి.

ప్రాకృతమునకు వర్ణములేబది; అందచ్చులు: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, ౦:, * అని పదునైదు. హల్లులు: క,ఖ,గ,ఘ,ఙ; చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ, ట, ఠ,డ,ఢ,ణ,త,థ,ద,ధ,న;ప,ఫ,బ,భ,మ,య,ర,ల,వ,శ,ష,స,హ,ళ. - అని ముప్పదియైదు.

ప్రాకృత వర్ణసంఖ్యావిషయమున ననేకు లనేకవిధములుగ నభిప్రాయపడియున్నారు. ఆంధ్రశబ్ద చింతామణికారునిమతమున బ్రాకృతమునకు వర్ణములు నలువదిమాత్రము. ఈ మతమునే నేటివఱకు నాంధ్రవైయాకరణు లవలంబించియున్నారు కాని, యీసంఖ్య మహారాష్ట్రీప్రాకృతమునకు మాత్రము చెల్లునేమో. మహారాష్ట్రీప్రాకృత మొక్కదానికే ప్రాకృతమను సంజ్ఞ చెల్లదు. ప్రాకృతములు, మహారాష్ట్రీ, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికా పైశాచి, అపభ్రంశము, అని యాఱుగలవని సాధారణాభిప్రాయము. కాని, యిది సరికాదు. ఈ యాఱును నిటీవలి ప్రాకృత కావ్యములందును, ప్రాకృత లక్షణగ్రంథముల్ందును బేర్కొనబడిన ముఖ్య ప్రాకృతములు. కావ్యములలో నుపయోగింపబడు మహారాష్ట్రీ, శౌరసేనీ, మాగధీ భాషలలో జైనులు తమగ్రంథములందు వాడినభాషలు సాధారణ భాషలకు విలక్షణముగనుండి జైనమాహారాష్ట్రీ, జైనశౌరసేనీ, అర్థమాగధీ సంజ్ఞల నందియున్నవి. పాలిభాష యర్థమాగధీ భాషాభేదమని కొందఱును, పైశాచీ భాషాభేదమని కొందఱును దలంచుచున్నారు. ఇవియేకాక ప్రాచ్యా, అవంతీ, బాహ్లికీ, శాకారి, ఢాక్కీ, చాండాలీ, శాబరీ, ఆభీరికీ, సాక్కీ, నాగర, ఉపనాగర, వ్రాచడ, దాక్షిణాత్య, ద్రావిడాది ప్రాకృతములెన్నియో యాయా లక్షణగ్రంథములలో స్మరింపబడినవి. ఇవి యాయా ప్రధాన ప్రాకృతములకు జేర్పబడి వానినాని వికారములుగ దెలుపబడియున్నవి. అపభ్రంశ భాషయనున దొక్కటేకాదు. ప్రధాన ప్రాకృతములలో నొక్కొక్కదానికిని గొన్ని యపభ్రంశము లున్నవి. అట్లే పైశాచీభాషయందు పదునొకండు భేదములను రామతర్కవాగీశుడు తన 'ప్రాకృతకల్పతరు' నను లక్షణగ్రంథమందును, లక్ష్మీధరాదులు తమతమ ప్రాకృత వ్యాకరణములందు మఱి

____________________________________________________________________

  • ప్రాకృతవర్ణములలో జిన్నయసూరి విసర్గమును జేర్చినాడు; అది పాలిభాషలో మాత్రము జిహ్వామూలీయముగ గానవచ్చుచున్నది. 'ఞ' విడచినాడు; ఇది సరికాదు.