పుట:Andhra bhasha charitramu part 1.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యభిప్రాయము. భాగవతపురాణమున ద్రమిళశబ్దము వాడబడియున్నది. వరాహమిహురుడు బృహత్సంహితయందు ద్రమిడశబ్దమును వాడియున్నాడు, ప్రాచీన మళయాళభాషలో రచింపబడిన పురాణములందును మహాకూటమునొద్ద మంగళేశుడనురాజు స్థాపించిన శిలాశాసనమునందును (597-608), ద్రమిళశబ్దము కాన్పించుచున్నది. గ్రీకుచరిత్రకారుల గ్రంథములలో దరిమిచె, దమిరిచ యను రూపములు కానవచ్చుచున్నవి.

ఈ క్రిందివి ద్రావిడభాషలుగ నే డెంచబడుచున్నవి. 1. తమిళము. 2. మళయాళము. 3. తుళు. 4. కొడగు. 5. తొద. 6. కోత. 7. కన్నడము. 8. కురుఖు. 9. మల్తొ. 10. గోంది. 11. కుఇ. 12. కోలామీ. 13. తెలుగు. 14. బ్రాహూఇ. ఇవిగాక మఱికొన్ని చిన్నమాండలికభాషలును ద్రావిడభాషావర్గములో జేరినవి. ఈ భాషల పరస్పర సంబంధము ప్రక్కపుటలో నివ్వబడినది.

ద్రవిడశబ్దము జాతిపరముగ మనుస్మృతియందును, వరాహమిహురుని బృహజ్జాతకము నందును, మహాభారతము నందును, ఇతర సంస్కృత వాఙ్మయము నందును స్మరింపబడి యున్నది. శత్రుంజయమాహాత్మ్యమను గ్రంథమున ద్రావిడ జాతివారు వ్రాత్యులయిన క్షత్రియులనియు, వృషభస్వామి పుత్రుడగు ద్రవిడుని తనయులనియు దెలుపబడియున్నది. పంచ ద్రావిడులనియు పంచగౌడులనియు నొక వ్యవహారమున్నది. పంచద్రావిడు లనగ నంధ్రులు, కర్నాటకులు, గుర్జరులు, తైలంగులు, మహారాష్ట్రులు నని చెప్పుదురు. కుమారిలభట్టురచించిన తాంత్రవార్తికమున నాంధ్రద్రావిడ భాషయనునది పేర్కొనబడెనని బర్నెలు పండితుడు తానురచించిన దాక్షిణాత్యలిపి చరిత్ర (South Indian Paleography) మను గ్రంధమున వ్రాసియున్నాడు. ఇది సరికాదనియు "అథద్రావిడభాషాయాం" అని గ్రంథముననున్నదానిని "ఆంధ్రగ్రావిడభాషాయాం" అనిచదివి బర్నెలు భ్రమపడెననియు పి.టి. శ్రీనివాసఅయ్యంగారు తెలిపియున్నారు.

ద్రావిడభాషల పరస్పర సంబంధమునుగూర్చియు ద్రావిడభాషా కుటుంబమునకును నితరభాషా కుటుంబములకును గల సంబంధమును గూర్చియు వివరించుచు గాల్డ్‌వెల్ పండితుడొక యుత్కృష్టగ్రంథమును రచించియున్నాడు. అత డాగ్రంథమున ద్రావిడభాషల సమాన లక్షణముల నేర్పఱిచి వాని యేకత్వమును జక్కగ నిరూపించి యున్నాడు. ద్రావిడ భాషా కుటుంబమునకును నితర భాషాకుటుంబములకును గల సంబంధమును గూర్చి యెక్కువగా జర్చించి ద్రావిడభాషలకును ఇండోయూరపియను భాషలకును దగ్గఱ సంబంధము లేదనియు, సిథి యనుభాషాకుటుంబముతో వానికి సన్నిహిత సంబంధముగలదనియు దెలిపియున్నాడు. అతనికాలముననే