పుట:Andhra bhasha charitramu part 1.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగరాపభ్రంశమునుండి గుజరాతీభాష యేర్పడినది. ఈ యపభ్రంశభాషయే యింకను వ్యాపించి శౌరసేనా పభ్రంశముగ బరిణమించి నేటి పశ్చిమ హిందీభాష యయినది. దీనితో సంబంధించినదే 'ఠాక్క'యను నపభ్రంశమును నుప-నాగరాపభ్రంశమును నయియున్నవి. ఇవి పంజాబు దేశము లోని మాండలిక భాషలకు మాతృకలయినవి. ఆవంత్యా పభ్రంశము దీనివికారమే. దీనినుండియే నేటి రాజస్థానీభాష కలిగినది.

ఇక నుత్తరదేశీయ భాషావర్గమునకు సంబంధించిన ప్రాకృతా పభ్రంశ భాషలు పేర్కొనదగిన వెవ్వియులేవు. ఇక్కడి జనుల పూర్వికులు టిబెటో-బర్మను జాతులవారు. వీరికిని నార్యజాతుల వారికిని సమ్మేళనము కలిగెను. అటుపిమ్మట పిశాచ లేక దర్దికు జాతులవా రాదేశమున బ్రవేశించిరి. మధ్యాసియానుండి గూర్జరులొక యార్యభాషతో బ్రవేశించిరి. అటుపిమ్మట రాజపుత్ర స్థానమునుండి కొందఱందుచేరిరి. కావున నిచ్చటి భాషలు మిక్కిలి సంకరములై యుండుట సంభవించినది. రాజపుత్రస్థానమునుండి వచ్చినవారి భాషాలక్షణము లెక్కువగా నుండుటచే నిచ్చటి భాష కావంత్యాపభ్రంశము మూలమని చెప్పవచ్చును.

పైని వివరించిన ప్రాకృతభాషలయొక్కయు నేడార్యభాషలుగా గ్రహింపబడుచున్న వానియొక్కయు సంబంధ మీప్రక్కపట్టికయందు చూపబడినది.

ద్రావిడభాషలు.

దక్షిణ యిండియాదేశమందలి ముఖ్యభాషలన్నియు ద్రావిడభాషా కుటుంబమున జేరినవి. ఈ భాషలను మాట్లాడువారిసంఖ్య యించుమించు 570 లక్షలు.

ద్రవిడమనునది సంస్కృతపదమనియు దానినుండి ద్రమిడ, తిరమడ, ద్రమిళ, దమిళ, తమిఱ్, తమిళ్, శబ్దములు పుట్టినవనియు గొందఱభిప్రాయ పడుచున్నారు. మఱికొందఱు పాలిభాషయందు వ్రాయబడిన మహావంశమను గ్రంధమునందు దమిళశబ్దము కాన్పించుటచే దానిని సంస్కృతీకరించి ద్రమిళ, ద్రవిడ శబ్దములుగా మార్చిరనియు దమిళశబ్దమునుండియే తమిళము అను పదముకలిగినది కాని యది ద్రవిడశబ్దభవము కాదనియు దెలుపుచున్నారు. ప్రాకృతవాఙ్మయమున దమిళ, దవిడ, యనురూపములు గాన్పించుచున్నను, దమిళయనునదే యతిప్రాచీనరూపము. దమిళ, దవిడ శబ్దములే ద్రమిల, ద్రమిడ, ద్రవిడ యను రూపములను దాల్చియుండునని వీరి