Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాద ప్రతివాదన

73

మూలుగునే ఆస్వాదిస్తారుగాని, పద్యంలోని పదాల్ని లక్ష్యపెట్టనే పెట్టరు. పామరజనం తరఫున వాదించి క్షుద్రరాగమేనా లేకపోతే వాళ్లకి మహాయిబ్బంది అని చెప్పేవాళ్లు, కవిభావానికి ఆ పామరుల్ని దూరంచెయ్యాలి అనడమేకాకుండా, పద్యాస్వాదన విషయంలో వాళ్ల అజ్ఞానాన్ని ఖాయపరచి శాశ్వతం చేయదలిచిన పుణ్యం, అను కోకుండా, కట్టుగుంటున్నా రన్నమాట! అటువంటి పామరుల నిరర్థక శ్లాఘకుడా మూటకట్టుగుని మురిసిపోయి, దాన్ని పద్యశ్లాఘకిందా నటనాశ్లాఘకిందా జమకట్టించాలనా, వాళ్లబాధ ! అజ్ఞానులచేత 'అవును' అనిపించడానికా రాగం ?

'పద్యంలో ఉండగల రసాన్ని ఆస్వాదించగా, అది రాగంలోకి దిగుతంది. ఆ మోస్తురుగా పద్యాన్ని ఆస్వాదించి ఇతరులచేత ఆస్వా దింప చెయ్యలేనివాళ్లు రాగం తియ్యలేక, తీసేవాళ్లని వద్దంటారు' అనే అభిప్రాయం కొందరు వెల్లడించారు. పై వాక్యంలో 'రసం' అనే మాట ప్రవేశించి ఉంది. అనిశ్చతమైన ఉత్కృష్టపదాలలో అది ఒకటి. ఇది ఫలానాఅని ఇన్ని ముక్కల్లో చెప్పాలంటే సామాన్యులకి కోపంవస్తుంది. తెలిసినవాళ్లని అడిగితే, కావలిసినంత గ్రంథం చెప్పి గభరాయింప చేస్తారు, అదేముటో తేల్చకుండా ! భాషల్లో ఉండే కొన్ని కొన్ని పదాలు అట్లాంటివి ! వాట్ల అర్థాన్ని ఎవరి త్రాణ ననుసరించి వాళ్లు గ్రహిస్తూం టారు. ప్రకృతి మానవుల స్థితిగతులూ మహిమాస్వభావాలూ ఆకార ఆంతర్యాలూ గ్రహించిన మానవుడు తన హృదయం ఈశ్వర సంకల్పాలకి ఉప్పొంగినప్పుడు ఆర్ద్రహృదయుడై ఒహో, ఆహా, ఒస్, అబ్బా, అల్లానా, పోనీలే, అయ్యో, ఔరా మొదలైనవి అనడం సార్థకఅనుభవం. అక్కడితో ఉండ బట్టలేక ఆ మానవుడు తత్తుల్యమైన అనుభూతి ఇతరమానవులకి కలిగించాలనే సదుద్దేశంతో బయల్దేరి తనకి మిక్కిలి అనువైన సాధనం అందునిమిత్తం ఎన్నుకుంటాడు, -