Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనాయన దర్శనము చేసియుంటిని. ఆ మహారాజు నా పద్యములు విని యానందించి విజయనగరము రమ్మని సెలవిచ్చెను. ఆయనయాజ్ఞచే మఱొకపుడు రాజధానికి బోయి జమ్మి వాసుదేవ రావుపంతులుగారి సాహాయ్యమున ఆనందగజపతి కుమార రాజేంద్రుని సందర్శింప గలిగితిని వారు నాకవితాధోరణి కానందపడి నన్ను దమయొద్ద నుంచెద మనిరి. ఇంతలో మహారాజుగారు సకుటుంబముగా గాశికి బోవ నయ్యెను. నన్నును దమతో రమ్మని చెప్పిరి. కాని నేను వెళ్ల వీలుగలుగలేదు. మేము తిరిగి వచ్చినతరువాత దర్శనము చేయుడని నాకు జెప్పివా రేగిరి. కావున నే నన్యాశ్రయము చేయజాలను."


నరసింహాచార్యునిమాటలు విని వావిలివలస ప్రభువు అబ్బురపడెను. అప్పటి కీకవివయస్సు ఇరువదిరెండేండ్లుమాత్రము, 1864 లో నీకవి తల్లితో దక్షిణదేశయాత్ర చేయుచు శ్రీరంగమునకు వచ్చి యచ్చట గొంతకాల ముండెను. అపుడే "వీతభవతృష్ణ! రంగేశ వేషకృష్ణ" అను మకుటమున నొక శతకము రుక్మిణీకల్యాణ కథాత్మకముగ రచించెను. ఈశతకము వావిళ్ళవారును, చెలికాని లచ్చారావుగారు నుద్ధరించి శతక సంపుటములలో బ్రకటించిరి. అందలి యొకపద్యము:


నీ కట్టివదలిన నెఱిక కన్నుల నద్ది
            యుత్తరీయంబు నుంచుకొందు
నీచుట్టిడిచిన నిరుపమ మాల్యముల్
            ముదమంది కొప్పులో ముడిచికొందు
నీ మహత్తర పాద నీరేజ తీర్థంబు
           చేఁద్రావి శిరమునఁ జిలికికొందు
నీ నోటికవ్రంపు నెఱివీడె మిచ్చుచ
           నమృతంబుగాఁ గేల నందుకొందు
నీదు పాదుక లౌదలఁ బాదుకొల్పి
చెనఁటి జన్మంబు సఫలతఁ జేసికొందు
నయ్య దాస్య మొసంగఁగదయ్య నేఁడు
వీతభవతృష్ణ! రంగేశ వేషకృష్ణ!

( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)