Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్వము మాత్రము ధారావాహి. ఆనాడు పెద్దపండితులైన కొక్కొండ వేంకటరత్న శర్మ, బహుజనపల్లి సీతారామాచార్యులు నీగ్రంథము మీద మంచి యభిప్రాయములిచ్చిరి. "...దండికావ్యము కంటెను అభినవ దండికావ్యముకంటెను జాలమేలనియెన్న దగియున్నది " అని వేంకటరత్నశర్మగారును, "...ఆధునిక గ్రంథస్థములని తెలియక యిందలి గద్యపద్యములను విన్నవారు అవి పూర్వగ్రంథస్థములేయని నిస్సందేహముగ దలంతురు " అని సీతారామాచార్యులుగారును విచిత్ర రామాయణమును గొండాడిరి. ఇందలి కవిత్వపు మచ్చునకు రెండు పద్యములు:

గుంపులుగూడి సీత మనకు న్మనసివ్వదు గాని చన్మొనల్
సొంపపు శక్రనీల మణిసోయగము న్వహియించి యున్న వీ
చంపకగంధి మోముజిగి చందురుతేటకు సాటిరా దగున్
దంపతులేమి నోచిరొకొ తథ్యము గర్భిణియందురందరున్.

లలితేందీవర కైరవాకృతజ కల్హరాదిపుష్పౌఘ సం
చలదిందిందిర బృందగానలహరీ సంయుక్తమంద క్రమా
నిలసంచారకృతార్భకోర్మియుత పానీయౌఘముంగల్గి ని
ర్మలమై యొప్పు సరోవరంబుగని రా క్ష్మాపుత్రికాలక్ష్మణుల్.

శాస్త్రిగారు తమ 78 వ యేట విచిత్రరామాయణమున నుత్తర కాండము సంపూర్తిపరిచి వారే ముద్రింపించుకొనిరి. తరువాత వారి కుమారులు 1937 లో నీగ్రంథము సమగ్రముగ వెలువరించిరి.

ఈకావ్యముగాక మనకవి ' విరాగసుమతీసంవాద ' మను వేదాంతపరమగు హరికథను వ్రాసెను. వీరికి నాగబంధ రథబంధాదుల రచనయందు మంచినేరుపు కలదు. గానకళలో జక్కని ప్రవేశము కలదు. ముహూర్త భాగమున బెద్ద యనుభవము కలదు. ఈయన యెట్టి కవియో యట్టి నైష్ఠికుడు. ఏకాదశీవ్రతము విడిచియెరుగడు. ఇట్టి భక్తకవి నోటినుండి వచ్చిన " విచిత్రరామాయణము " తెలుగుబాసకు దొడవగుట కాశ్చర్యమేమి ?