పుట:AndhraRachaitaluVol1.djvu/549

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువునకు శాస్త్రిగారంకిత మిచ్చినారనుట ప్రకృతము తలచుకోవలసిన విషయము. ఇది యిటులుండగా, శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితులుగా నుండి వీరు కావించిన వాజ్మయసేవ మఱచిపోరానిది. 1925 సం. నుండి 1937 వఱకు వీరా కార్యాలయోద్యోగము నిర్వహించిరి. ఈ యుద్యోగమువలన శాస్త్రిగారి మేధాసంపద మఱింత మెఱుగులు దేఱినది. ఆంధ్రప్రబందములలోని రహస్యములు వెంపరాలవారికి దెలిసినన్ని వేఱొకరికి దెలియవేమో యనిపించును. ఆయన కున్న ప్రయోగపరిజ్ఞానము నిస్సమానమైనది. ఆయనకు వేలకొలది పద్యములు నోటికి వచ్చును. ఒక ప్రయోగమునకు బది యుదాహరణపద్యములు వెంట వెంటనే చదివి చూపగలరన్నది యతిశయముగా నన్నమాట గాదు. ఇట్టి ధారణాపాటవముగల వీరు సూర్యరాయ నిఘంటు కార్యాలయమునకు జేసిన యువకృతి కృతజ్ఞతకు బాత్రమైనది.

మఱి, శాస్త్రులుగారి కవితారచనలోని విశిష్టత యేమనగా, వారు ప్రయోగవైచిత్ర్యమును వలచిన రచయిత లగుటచే నడుగడుగున నూతన ప్రయోగములు కనబఱచెదరు. ఇంచుమించుగా వారి కావ్యములోని పెక్కు ఘట్టములు భట్టి కావ్యమును స్ఫురణకు దెచ్చుచుండును. పాణినీయము నామూలచూడము చుళుకించినవారు కావున వారి కవిత యిటు లుండుటలో నబ్బురమేమి? ప్రయోగదృష్టి యెంత యున్నదో శాస్త్రులు గారికి రసదృష్టియు నంతేయున్నది. ఆ హేతువున వారి కృతులు పండిత హృదయరంజకములై యున్నవి. మునిత్రయ చరిత్రము నందలి కొన్ని యుదాహరణములు:

ఉ.వియ్యపురాలటుల్ తినెడు వేళకు వచ్చుటెకాని యింత సా

హాయ్యముసేయ వాడుదికదా పసిపాప విలాసమొందగా