పుట:AndhraRachaitaluVol1.djvu/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

512

లలో కళాపీఠములు స్థాపించి కులపతిగానుండి కళారాధనము చేసినారు. బాపిరాజుగారి చిత్రములు మంచికీర్తి సంపాదించుకొన్నవి. ఖడ్గతిక్కన, శబ్దబ్రహ్మ, శ్వేతతార, శశికళ, రుద్రమదేవి, నాగనృత్యం, సముద్రగుప్తుడు, బుద్ధుడు, సూర్యదేవ, భిక్షుకి, గౌరీశంకర్, భిక్షుకి, మీరాబాయి, ఈ చిత్రములు ప్రతిష్ఠ తెచ్చుకొన్నవి.

అమృతహృదయముతో నిన్నికళల లోతులు ముట్టిన బాపిరాజుగారు ధన్యులు. ఆయన యక్షరములలో రసికహృదయ తంత్రులను పలికింప జేయగలశక్తి యున్నది. ఆయన పాటలు, బొమ్మలు జీవన్మూర్తులవలె దెలుగున సంచరింప గలవి. ఆయన నవలలకు ఉత్తమ స్థానము వచ్చినది. మరపురాని బాపిరాజుగారి ప్రేమగీత మిది పాడుకొందము.

మరచిపోవబోకె బాల మరచిపోవకే !
అరచి అరచి పిలువలేను
తరచి తరచి కోరలేను
పరచిపోవు కాంక్షలొనె తీపిలోనె, మరచిపోవకే !
హోరుమనే కెరటాలే
మారుమోగె నాపాటలు
ఒరిగిపడే రేఖలోనె నురుగులోనె మరచిపోవకే !
ఒక్కణ్ణే యిసుకఒడ్డు
ఒక్కణ్ణే నీరుదెసలు
ఒదిగిపోవు దూరాలూ
చెదిరిపోవు మేఘాలూ, మరచి పోవకే !
అదుముకొన్న నీతలపులు
దిదిమిరాల్చు నాహృదయము
ఏరలేను రేకలన్ని
ఏరలేను పుప్పొడినీ, మరచిపోవకే !