పుట:AndhraRachaitaluVol1.djvu/529

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మెచ్చుకోలుపడయగల కవితారచన జాషువకవిగారికి నైసర్గికమైయుండి వచ్చినది. రసికవిద్వాంసులు వీరికృతులు చూచి మురిసిపోవుదురు. ఏమనగా, తియ్యనైన శయ్యావైభవముతో, నిర్దుష్టమైన భాషాప్రాభవముతో హృదయములో నున్న విషయమంతయు బాఠకున కందీయగల కూర్పునేర్పు వీరి కబ్బినది. అబ్బిన చాతుర్యమును నిరంతరాభ్యాసమువలన బెంపుచేసికొనిరి. దానితో, ఆయన ప్రతిపద్యము హాయి యనిపించునట్లు వ్రాయగలుగును. బంగారు తీగెవంటి యేదోయొకధారాళత! వృత్తములు, విశేషించి సీసములు, క్రొత్తధోరణిలో క్రొత్తసొంపులు పెట్టి వ్రాయుటలో నీ కవి పేరుపడెను. ఈయన రచించిన ఖండ కావ్యములన్నింటను శైలి సరిగా నొకేతీరున సాగుచుండుట గమనింపదగినది. ఆయన పలుకుబడులు, జాతీయములు, విదేశీయ పదప్రయోగములు, ఎత్తుగడలు-ఎక్కడకు వెళ్లినను మారిపోవు. అదీ ఆయన ప్రత్యేకత. ఈ పద్యములు కొన్ని చూడుడు:

వేగిరాజుల సతీ వితతికి గరువంపు

నడక నేర్పినది నన్నయ్యరచన

తెనుగుభాషా పదమ్మునకు జారని వన్నె

బట్టించినది కవిబ్రహ్మపలుకు

కంచుడక్కల నోరు గట్టించి జయ కేత

నముల నెత్తినది శ్రీనాథుజిహ్వ

ప్రతిలేని యపవర్గ పదవి వంకకు రహ

దారి తీసినది పోతన చరిత్ర

విజయనగరాధిపుల పురావేదికలకు

నందలంబుల మోయు మర్యాద గరపి

తనివి గొన్నది మొన్న పెద్దన కవిత్వ

మాంధ్ర భారతీ! నీ తేజ మద్బుతంబు.